యాదగిరిగుట్ట, మార్చి 11 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి ఐఎస్వో 9000:2015 సర్టిఫికెట్ లభించింది. గుట్ట దేవస్థానంలో అత్యుత్తమమైన ఆధ్యాత్మిక సేవలు, అభ్యాసానికి అనుకూలమైన స్థలంతోపాటు, నాణ్యమైన నిర్వహణ, దేవుడికి నైవేద్యం, ప్రసాదం శుభ్రతతో ఉందని హెచ్‌వైఎం అంతర్జాతీయ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ జనరల్ మేనేజర్ అధినేత శివయ్య తెలిపారు. సంస్థ అధినేత చేతుల మీదుగా యాదగిరిగుట్టలో మంగళవారం రాష్ట్ర దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజారామయ్యర్ సర్టిఫికెట్‌ను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేవస్థానం ప్రసాదం తయారీ, పంపిణీలో అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలను పాటించడంతోపాటు భక్తులకు భద్రంగా, పరిశుభ్రంగా అందిస్తున్నామని తెలిపారు.