హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద దరఖాస్తులు పెట్టడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సమాచార హక్కు చట్టాన్ని, లోక్‌పాల్, లోకాయుక్త వంటి సంస్థలను అవమానించిన బీజేపీ, ఇప్పుడు మళ్లీ వాటిని ఆశ్రయించడం ఏంటని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. సమాచార హక్కు చట్టంలో సవరణలు చేసి, కమిషనర్ల హోదాలను తగ్గించి స్వతంత్రతను దెబ్బతీసిన పార్టీయే బీజేపీ అని గుర్తుచేస్తున్నారు. అలాంటి బీజేపీకి చెందిన బండి సంజయ్‌కి ఆర్టీఐ కింద దరఖాస్తులు పెట్టే నైతిక హక్కు ఉన్నదా? అని నెటిజన్లు నిలదీస్తున్నారు. ఈ సందర్భంగా కొన్ని ప్రశ్నలు సంధిస్తూ వాటికి సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
1) ఆర్టీఐ చట్టం-2005కు 2019లో సవరణలు చేసి బలహీనం చేసింది వాస్తవం కాదా?
ఆర్టీఐ చట్టం ప్రకారం కేంద్ర సమాచార ముఖ్య కమిషనర్ హోదా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర ఎన్నికల ముఖ్య కమిషనర్ హోదాలతో సమానం. రాష్ర్టాల్లో ఎన్నికల కమిషనర్లు, సీఎస్‌తో సమానమైన హోదా కల్పించింది. జీతభత్యాలు కూడా ఇదే స్థాయిలో ఉండాలని పేర్కొన్నది. ఐదేండ్లు లేదా 65 ఏండ్ల వయసు వచ్చే వరకు పదవిలో ఉండాలని సూచించింది. కానీ మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఈ హోదాను తగ్గించింది. సమాచార కమిషనర్ల పదవీ కాలాన్ని నిర్ణయించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి కట్టబెట్టింది. హోదా తగ్గడంతో కమిషనర్ల స్వేచ్ఛ, పరిధి తగ్గిందని, పదవీ కాలాన్ని తగ్గించడంతో కేంద్ర ప్రభుత్వ పెత్తనం పెరిగిందని ఆర్టీఐ కార్యకర్తలు విమర్శిస్తున్నారు.
2) మోదీ డిగ్రీ సర్టిఫికెట్లను ఎందుకు బహిర్గతం చేయరు?
ప్రధాని మోదీ 1978లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీఏ పాస్ అయినట్టు చెప్పుకొంటున్నారు. దీంతో ఓ కార్యకర్త ఢిల్లీ యూనివర్సిటీకి ఆర్టీఐ దరఖాస్తు చేయగా వర్సిటీ దానిని తిరస్కరించింది. సమాచారం ఇవ్వాలని కేంద్ర సమాచార కమిషన్ నుంచి ఆదేశాలు రాగా.. హైకోర్టు నుంచి స్టే తెచ్చారు. చివరగా ఢిల్లీ వర్సిటీ 1978లో పాస్ అయిన విద్యార్థుల డాటా లేదని చేతులెత్తేసింది.
3) స్మృతి ఇరానీ చదువును ఎందుకు బయటపెట్టలేదు?
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ బీఏ చదివానని ఒకసారి, బీకాం చదివానని మరోసారి ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. దీంతో ఆమె విద్యార్హతపై సమాచారం ఇవ్వాలంటూ ఢిల్లీ యూనివర్సిటీకి ఆర్టీఐ కింద దరఖాస్తు చేయగా.. వ్యక్తిగత వివరాలు ఇవ్వలేం అంటూ తిరస్కరించింది. వ్యవహారం కోర్టు వరకు వెళ్లింది. కొన్నేండ్ల తర్వాత ఆమె తన మార్కుల సర్టిఫికెట్లను బహిర్గతం చేసింది.
4) పీఎం కేర్స్ విరాళాలను, ఖర్చులను ఎందుకు వెల్లడించరు?
కరోనా విపత్తు సమయంలో ప్రజలను ఆదుకొనేందుకంటూ ప్రధాని మోదీ ‘పీఎం కేర్స్’ పేరుతో నిధుల సేకరణ మొదలుపెట్టారు. వ్యక్తులు, ప్రభుత్వాలు, ప్రైవేట్ సంస్థల నుంచి భారీగా నిధులు సేకరిస్తూనే ఉన్నారు. అయితే ఎంత వచ్చాయి? ఎంత, ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారు? అని తెలుసుకోవడానికి సమాచారం అడిగితే మాత్రం తిరస్కరిస్తున్నారు. ప్రభుత్వ నిధే అయినా.. ప్రైవేట్ వ్యక్తుల నుంచి విరాళాలు సేకరిస్తున్నందున సమాచారం ఇవ్వలేం అంటూ సంబంధం లేని సమాధానం చెప్తున్నారని ఆర్టీఐ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
5) లోక్‌పాల్ చట్టం కోసం అన్నాహజారేతో కలిసి బీజేపీ పోరాడింది. 2013లో చట్టం ఆమోదం పొంది, 2014లో అమల్లోకి వచ్చింది. అయినా.. 2019 వరకు మోదీ ప్రభుత్వం లోక్‌పాల్‌ను నియమించలేదు. అవినీతిపై యుద్ధం పేరుతో పోరాడిన బీజేపీ ఎందుకు ఐదేండ్లపాటు ఆ పదవిని ఖాళీగా ఉంచింది? అని నిలదీస్తున్నారు.
6) మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2003 నవంబర్ నుంచి 2013 డిసెంబర్ వరకు లోకాయుక్తను ఎందుకు నియమించలేదని ప్రశ్నిస్తున్నారు.
55 వేల దరఖాస్తులు రిజెక్ట్
2020-21లో కేంద్ర ప్రభుత్వానికి సుమారు 13 లక్షల ఆర్టీఐ దరఖాస్తులు రాగా, ఇందులో సుమారు 55వేల దరఖాస్తులను తిరస్కరించింది. వీటిలో సుమారు 12 వేల దరఖాస్తులు ‘వ్యక్తిగత సమాచారం’ పేరుతో తిరస్కరించారు. ఇందులో అత్యధిక శాతం అధికారులు, రాజకీయ నాయకుల అవినీతికి సంబంధించినవే అని ఆర్టీఐ కార్యకర్తలు చెప్తున్నారు. సుమారు వెయ్యికిపైగా దరఖాస్తులు ‘దేశ భద్రత’ పేరుతో తిరస్కరించారన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు సమయానికి సమాచారం ఇవ్వకపోవడంతో సుమారు 60 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో పడ్డాయి.