హైదరాబాద్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) అధికారులు తెలంగాణ రాజముద్రను మార్చడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఫైర్ అయ్యారు. ఇది అధికారిక నిర్ణయమా లేక అనధికార నిర్లక్ష్యమా అని మండిపడ్డారు. అసలు ఏం జరుగుతుందో కనీసం మీకైనా తెలుసా అంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని ప్రశ్నించారు. తెలంగాణ అస్తిత్వ చిహ్నాలైన
కాకతీయ తోరణం, చార్మినార్లతో ఈ వెకిలి పనులు ఏంటంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.
కాకతీయ కళాతోరణం, చార్మినార్ లేని రాజముద్రతో గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం ఎదుట అధికారులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఇది.. ఈ కొత్త చిహ్నం ఎవరు, ఎప్పుడు ఆమోదించారంటూ నిలదీశారు. ఒకవేళ ఆమోదించకపోతే అధికారులు ఎందుకు దీన్ని వాడారన్నారు. దీనికి కారకులెవరో కనుక్కుని వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రాజముద్రను అధికారులు ఇష్టారీతిగా వినియోగిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని తక్కువ చేసేలా రాజముద్రలో మార్పులు చేసే ప్రతిపాదన ముందుకు తెచ్చింది. ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గింది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మాత్రం అత్యుత్సాహం చూపి రాజముద్రను మార్చారు. ఎల్ఆర్ఎస్పై సందేహాల నివృత్తి కోసం ప్రభుత్వం అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో హెల్ప్ డెస్కులను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో సోమవారం హెల్ప్ డెస్క్ బ్యానర్ ఏర్పాటు చేశారు.
ఇందులో తెలంగాణ రాజముద్ర మార్చేశారు. అధికారిక రాజముద్ర కాకుండా కొత్తగా చేసి పెట్టారు. అధికారులు రాజముద్రను మార్చడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం వరంగల్ చారిత్రక గొప్పదనాన్ని తెలిపేలా రాజముద్రలో కాకతీయ కళాతోరణాన్ని పెడితే, మున్సిపల్ కార్పొరేషన్ విరుద్ధంగా వ్యవహరించిందని విమర్శిస్తున్నారు. వరంగల్ నగర ఔన్నత్యాన్ని తగ్గించేలా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇది అధికారిక నిర్ణయమా లేక అనధికార నిర్లక్ష్యమా?
అసలు ఎం జరుగుతోందో కనీసం మీకైనా తెలుసా @TelanganaCS గారు?
తెలంగాణ అస్తిత్వ చిహ్నాలైన
కాకతీయ తోరణం, చార్మినార్ లతో ఈ వెకిలి పనులు ఏంటి ?కాకతీయ కళాతోరణం, చార్మినార్ లేని రాజముద్రతో గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ప్రధాన… pic.twitter.com/Pywlv8Yvt0
— KTR (@KTRBRS) August 27, 2024