DAP | హైదరాబాద్, నవంబర్ 7(నమస్తే తెలంగాణ): యాసంగి పంటల సాగుకు డీఏపీ ఎరువుల కొరత తప్పదా? మార్క్‌ఫెడ్, వ్యవసాయ శాఖ వద్ద బఫర్ స్టాక్ నిండుకున్నదా? డీఏపీ సరఫరాపై ఎరువుల కంపెనీలు చేతులెత్తేశాయా? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే వీటికి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. యాసంగి సాగుకు డీఏపీ కొరత ముప్పు పొంచి ఉన్నట్టుగా వ్యవసాయ శాఖ వర్గాల్లో హెచ్చరికలు వస్తున్నాయి. అవసరమైన స్థాయిలో సరఫరా లేకపోవడమే ఇందుకు కారణమని తెలిసింది. దీనికితోడు వ్యవసాయ శాఖ, మార్క్‌ఫెడ్ వద్ద బఫర్ స్టాక్ నిల్వలు భారీగా పడిపోయినట్టు తెలిసింది. మరోవైపు ప్రైవేటు కంపెనీలు డీఏపీ సరఫరాపై చేతులెత్తేసినట్టు సమాచారం. ఇప్పటికే రాష్ట్రంలో యాసంగి పంటల సాగు ప్రారంభమైంది. ఇలాంటి పరిస్థితుల్లో డీఏపీ కోసం రైతులకు ఇబ్బందులు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నిండుకున్న నిల్వలు!
వాస్తవానికి యాసంగి సీజన్‌కు సుమారు 1.5 లక్షల టన్నుల వరకు డీఏపీ అవసరమవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసినట్టు తెలిసింది. నవంబర్ నెలాఖరు వరకు సుమారు 65 వేల టన్నుల డీఏపీ నిల్వలు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం కేవలం 10 వేల టన్నులలోపే నిల్వలు ఉన్నట్టు సమాచారం. ఎరువులకు నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న మార్క్‌ఫెడ్ వద్ద కేవలం 3 వేల టన్నుల బఫర్ స్టాక్ ఉన్నట్టు తెలిసింది. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో 80 వేల టన్నుల డీఏపీ అవసరం ఉంటుంది. కానీ ఆ స్థాయిలో కంపెనీలు సరఫరా చేసే పరిస్థితి లేదని తెలిసింది. దీంతో ఈ సీజన్లో డీఏపీ కొరత తప్పదనే హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి.
నిరుడు బీఆర్ఎస్ సర్కారు ముందుచూపు
నిరుడు యాసంగి సాగుకు ముందే డీఏపీని అందుబాటులో ఉంచడం గమనార్హం. నిరుడు అక్టోబర్‌లో 30 వేల టన్నులు, నవంబర్‌లో 30 వేల టన్నులు, డిసెంబర్లో 35 వేల టన్నులు, జనవరిలో 29 వేల టన్నుల డీఏపీని అప్పటి ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. దీంతో రైతులకు అవస్థలు రాకుండా సర్కారు ముందుచూపుతో వ్యవహరించింది. డీఏపీ ఎరువుల కొరత దేశవ్యాప్తంగా కొనసాగుతున్నది. ఇప్పటికే పంజాబ్, హర్యానా రాష్ర్టాల్లో ఇది తీవ్రస్థాయికి చేరింది. డీఏపీ లభించక అక్కడి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఆందోళనల దాకా పరిస్థితి చేరింది. ఇది క్రమంగా దేశవ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది. తెలంగాణ, ఏపీ వంటి రాష్ర్టాల్లో మరో నెలరోజుల్లో యాసంగి పంటలు ఊపందుకోనున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో డీఏపీ లభించని పక్షంలో గందరగోళ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నది.
చేతులెత్తేసిన కంపెనీలు
డీఏపీ సరఫరాపై ఎరువుల కంపెనీలు చేతులెత్తేసినట్టు తెలిసింది. డీఏపీ తయారీకి అవసరమైన ముడి సరుకుల ధరలు భారీగా పెరగడంతో ఉత్పత్తిని తగ్గించినట్టు ఓ కంపెనీ ప్రతినిధి ద్వారా తెలిసింది. ముఖ్యంగా ఈస్టర్స్ యూరఫ్, పశ్చిమ దేశాల్లో, ఇజ్రాయిల్, హమాస్ యుద్ధంతో డీఏపీ ముడి వనరుల ధర భారీగా పెరిగినట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పెరిగిన ధరలకు అనుగుణంగా డీఏపీపై సబ్సిడీని పెంచేందుకు నిరాకరించినట్టు తెలిసింది. దీంతో నష్టాలు భరించి తయారుచేసి సైప్లె చేయలేక కంపెనీలు చేతులెత్తేసినట్టు తెలిసింది. ఓ ప్రముఖ కంపెనీ ఈ ఏడాది కేవలం 5 వేల టన్నుల సరఫరాకే పరిమితమైనట్టు సమాచారం.