మోర్తాడ్, ఏప్రిల్ 18 : రాష్ట్రంలో ఉన్నది ప్రజాపాలనా.. పోలీసుపాలనా? అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు. హామీల అమలుపై ప్రశ్నిస్తే తట్టుకోలేక ప్రభుత్వ పెద్దలు పోలీసులను ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు. మమ్మల్నే కొడతారు.. పైగా మామీదే కేసులు పెడుతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ కేసులు, లాఠీ దెబ్బలతో బీఆర్ఎస్ శ్రేణులను భయపెట్టలేరని హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్‌లో రెండ్రోజుల క్రితం జరిగిన పోలీసుల లాఠీచార్జి, అక్రమ కేసులు తదితర పరిణామాలను ప్రశాంత్‌రెడ్డి శుక్రవారం సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు.
‘కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రజాపాలన తెస్తమన్నరు, కానీ పోలీస్, రాక్షస పాలన నడిపిస్తుండ్రు. భీమ్‌గల్‌కు వచ్చిన మంత్రి జూపల్లి కృష్ణారావును కల్యాణలక్ష్మి చెక్కులతోపాటు ప్రభుత్వం ఇస్తానన్న తులం బంగారం ఎప్పుడిస్తారని అడిగినం. పెన్షన్లు ఎప్పుడు పెంచుతారని, సంపూర్ణ రుణమాఫీ ఎప్పుడు చేస్తారని మంత్రిని ప్రశ్నించాం. సీఎం మార్చి 31 లోపు రైతుభరోసా వేస్తామన్నారు. ఇప్పటికీ రైతుల ఖాతాలో ఆ డబ్బులు ఎందుకు జమకాలేదని అడిగినం. మిగతా హామీలు ఎప్పుడు అమలు చేస్తారని మంత్రిని అడుగుతుంటే కాంగ్రెస్ నాయకులు గొడవకు దిగారు. హామీలపై శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ కార్యకర్తలను కట్టడిచేసి, కాంగ్రెస్ కార్యకర్తలను ఫ్రీగా వదిలేశారు. పైగా బీఆర్ఎస్ కార్యకర్తలపై విచక్షణారహితంగా లాఠీచార్జి చేశారు. హామీలపై మంత్రి జూపల్లిని నిలదీసిన బీఆర్ఎస్ కార్యకర్తలపై బాల్కొండ కాంగ్రెస్ ఇన్చార్జి సునీల్‌రెడ్డి అక్రమ కేసులు పెట్టించిండు. కేసులు పెట్టాలంటూ సునీల్‌రెడ్డి ప్రెస్మీట్లో చెప్పగానే పోలీసులు ఆగమేఘాల మీద.. లాఠీచార్జిలో దెబ్బలు తిన్నవారిపై, నాతోపాటు 33 మందిపై అక్రమకేసులు పెట్టిండ్రు. పోలీసులే కొడ్తరు.. ఉల్టా కేసులు పెడ్తరు. ఇదేం పాలన? మీరు ఇచ్చిన హమీలు నెరవేర్చమని అడగడం ప్రతిపక్షపార్టీగా మా బాధ్యత. అందులో తప్పేముంది? కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రభుత్వ పెద్దలు, పోలీసులు ఎన్ని కేసులు పెట్టినా మా ఆత్మైస్థెర్యాన్ని దెబ్బతీయలేరు. మీరు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చేదాకా రెట్టింపు ఉత్సాహంతో, కసితో పోరాటం చేస్తూనే ఉంటాం. మా పోరాటానికి బాల్కొండ నియోజకవర్గ ప్రజలు, మహిళలు, రైతన్నలు అండగా నిలుస్తారు’ అని పేర్కొన్నారు.