New Ration Cards | కొత్త రేషన్ కార్డుల కోసం రాష్ట్ర ప్రజల ఎదురుచూపులు తప్పడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొత్త రేషన్‌కార్డుల జారీ విషయంలో ఇదుగో వచ్చే.. అదిగో వచ్చే అంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రకటనలు చేయడంతో లబ్ధిదారులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. కానీ ఏడాదిగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రేషన్‌కార్డులు లబ్ధిదారులకు అందని ద్రాక్షలా మారాయని చెప్పవచ్చు. ప్రజా పాలన దరఖాస్తులు తీసుకొని ఏడాది గడిచింది. అయినా కొత్త రేషన్‌కార్డుల జారీ గురించి పట్టించుకున్న పాపాన పోవడం లేదు. దీంతో ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు నిరాశే మిగులుతోంది.
రాష్ట్రంలో 89.97 లక్షల తెల్లరేషన్‌కార్డులు, 2.81కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు. కాంగ్రెస్ సర్కారు ప్రజాపాలన పేరుతో సంక్షేమ పథకాల కోసం దరఖాస్తులు స్వీకరించింది. కొత్తరేషన్‌కార్డుల కోసం 10 లక్షల దరఖాస్తులు, కార్డుల్లో మార్పుల కోసం 11.33 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ప్రజాపాలన దరఖాస్తులకు ముందు రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నవారు చాలామంది ఉన్నారు. చాలా ఏండ్లుగా కొత్త రేషన్ కార్డులు రాకపోవడంతో దరఖాస్తుదారుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ క్రమంలోనే కొత్త రేషన్ కార్డుల జారీపై ముఖ్యమంత్రి సహా మంత్రులు, ఎమ్మెల్యేలు చాలా రోజులుగా ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖమంత్రి పొన్నం ప్రభాకర్ ఇటీవల హుస్నాబాద్‌లో ప్రకటించారు. తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఇదే ప్రకటన చేశారు. దీంతో ఈసారైనా కొత్త రేషన్ కార్డులు ఇస్తారని ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. కానీ మంత్రి చెప్పిన సమయం సమీపిస్తున్నా కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన మార్గదర్శకాలు, సర్వేలు కానీ ఇప్పటి వరకు మొదలు కాలేదు. సర్కారు విధివిధానాలు, కొత్త రేషన్‌కార్డుల జారీపై స్పష్టమైన ప్రకటన జారీ చేయక పోవడంతో వీరంతా అయోమయానికి గురవుతున్నారు.
ఇప్పటికే కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి అర్హతలు, విధివిధానాల రూపకల్పనకు ముగ్గురు మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టులోనే ఒక సబ్ కమిటీని కూడా నియమించారు. ఈ కమిటీలో పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి చైర్మన్‌గా ఉండగా.. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సభ్యులుగా ఉన్నారు. విధివిధానాలు రూపొందిస్తామంటూ కమిటీ పలుసార్లు భేటీ కూడా అయ్యింది. కానీ ప్రభుత్వానికి ఇప్పటికీ నివేదిక ఇవ్వలేదు. ఈ కమిటీ నివేదిక ఇచ్చేదెప్పుడు..? కొత్త కార్డులు జారీ చేసేదెప్పుడు అని ప్రజల్లో ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దీనికితోడు జనవరి 26నుంచి ఇస్తారని కొందరు, మార్చి తరువాతనే ఇస్తారని మరికొందరు మంత్రులు ప్రకటనలు ఇస్తుండడం, రేషన్‌కార్డుల జారీ ప్రక్రియకు కనీసం అంకురార్పణ చేయకపోవడంతో చాలామంది నిరాశకు గురవుతున్నారు. దీంతో రేషన్‌కార్డుల పంపిణీపై నీలినీడలు అలుముకుంటున్నాయి. కేవలం ప్రకటనలతో మభ్యపెడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.