హైదరాబాద్ : లగచర్ల ( Lagacharla) రైతు హీర్యా నాయక్ కు పోలీసులు బేడీలు వేయడాన్ని బీఆర్ఎస్ (BRS) సోషల్ మీడియా కన్వీనర్, తెలంగాణ రెడ్కో మాజీ చైర్మన్ వై.సతీష్ రెడ్డి (Y Satish Reddy ) తీవ్రంగా ఖండించారు. రైతుల భూములు లాగేసుకోవాలని చూసి, తిరిగి వారిపైనే కేసులు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంకెళ్లు ఎవరికెయ్యాలి…? రైతుకా ? రేవంత్ కా..? అని ప్రశ్నించారు.
‘ ఫార్మా విలేజ్ (Pharma) కోసం రైతులతో కనీస చర్చలు జరపకుండా అధికారులను పంపి పోలీసులతో దాడి చేయించింది రేవంత్ అని ఆరోపించారు. బువ్వ పెట్టే తల్లి లాంటి భూమి కోసం, హక్కుల కోసం పోరాటం చేసిన రైతులకు బేడీలా..? ఇది ప్రజా స్వామ్యమా..? రాచరికమా అంటూ ప్రశ్నించారు. ఫార్మా నిర్ణయాన్ని సర్కారు వెనక్కి తీసుకున్నప్పుడు, సర్కారు పెట్టిన కేసులు ఎందుకు వెనక్కి తీసుకోరని ప్రశ్నించారు.
ఇప్పటికే ఫార్మాసిటీ కోసం సేకరించిన 19వేల ఎకరాల భూమి ఉండగా , మళ్లీ భూమి సేకరించాల్సిన అవసరం ఏమిటని అడిగారు. రైతులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
బంధిపోటు దొంగలకు, హంతకులకు వేసినట్టుగా రైతులకు బేడీలు వేయడంపై మనసును కలచివేసిందన్నారు.బేడీలు వేసి మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారని ఆరోపించారు. జాతీయ మానవహక్కుల కమిషన్ ఇప్పటికైనా లగచర్ల అంశంపై స్పందించి రైతులకు జైలు నుంచి విముక్తి కల్పించి రేవంత్ రెడ్డిపై సుమోటోగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.