హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ ) : రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎగవేతలు, దాటవేతలు, కాలయాపన (ఏ-డీ-కే) తప్ప కాంగ్రెస్ ఇంతకు మించి ఏమీ చేస్తలేదని బీఆర్ఎస్ నేత డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్ 55వేల ఉద్యోగాలు ఇచ్చామని, పదేండ్లలో కేసీఆర్ ఒక్క ఉద్యోగం కూడాఇవ్వలేదని పచ్చి అబద్ధాలు చెప్తూ.. నిరుద్యోగ యువతను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. నిరుద్యోగులను ఎన్నికల్లో వాడుకొని గద్దెనెక్కకా.. మొండిచేయి చూ పించారని విమర్శించారు. హైదరాబాద్ యూత్ డిక్లరేషన్‌లో తొలి ఏడాదిలోనే ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌చేశారు. ఈ విషయంపై అశోక్‌నగర్‌లో చర్చకు సిద్ధమా? అని రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు. తెలంగాణభవన్‌లో బుధవారం పార్టీ నేతలు కొమ్ముల నరేందర్, అల్లేని నిఖిల్, నిరుద్యోగ జేఏసీ నేతలు దామోదర్, మనోజ్‌కుమార్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో ఆర్థికశాఖ 2,32,308 ఉద్యోగాలకు అనుమతి ఇచ్చిందని గుర్తుచేశారు. 2,02,735 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చామని, పరీక్షలు నిర్వహించి 1,60,083 ఉద్యోగ నియామకాలు చేపట్టామని తెలిపారు. కోర్టు కేసులు, ఎన్నికల కోడ్ వల్ల ప్రక్రియల్లో 42,652 ఉద్యోగాలు ఉన్నాయని వివరించారు. అభయహస్తం మ్యానిఫెస్టోలో నిరుద్యోగ భృతికి రూ.4వేలు చొప్పున ఇస్తామని చెప్పి మోసగించారని వాసుదేవరెడ్డి దుయ్యబట్టారు. రాష్ట్రంలో 30 లక్షలమంది నిరుద్యోగులకు 15నెలల బకాయి అంటే దాదాపు రూ.18 వేల కోట్లు బాకీ పడ్డారని, చిత్తశుద్ధి ఉంటే వాటిని ఇవ్వాలని డిమాండ్‌చేశారు. కాంగ్రెస్ పాలన 15 నెలలు గడిచినా ఇప్పటికీ విద్యాశాఖ మంత్రి లేకపోవడం శోచనీయమని అన్నారు.