Wardha Project | హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ‘అమ్మ పెట్టదు.. అడుక్కుతిననివ్వదు’ అన్న చందంగా వ్యవహరిస్తున్నది. గతంలో అధికారంలో ఉన్నప్పుడు కొత్తగా ఒక్క ప్రాజెక్టునూ కట్టలేదు. ఇప్పుడు ఏడాది గడచినా ఆ దిశగా అడుగు వేయలేదు. కానీ, అనేకవిధాలుగా మేధోమథనం సాగించి రూపకల్పన చేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వార్ధా ప్రాజెక్టును అటకెక్కించింది. సీడబ్ల్యూసీ కోరిన వివరాలను ఇవ్వకుండా ఉద్దేశపూర్వంగా కాలయాపన చేసింది. దీంతో ఆ ప్రాజెక్టు డీపీఆర్‌ను కేంద్ర జలసంఘం వెనక్కి పంపింది. మరోవైపు ప్రాణహితపై తుమ్మిడిహెట్టి బరాజ్‌కు సంబంధించి ఇప్పటివరకు రాష్ట్ర సర్కారు చర్యలు చేపట్టలేదు.
ఉమ్మడి ఏపీ సర్కారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టు డిజైన్‌ను ఇష్టారీతిన చేపట్టింది. వార్ధా, వేన్గంగా నదులు కలిసిన తర్వాత కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద రూ.2500 కోట్లతో బరాజ్‌ను నిర్మించాలని 2007లో ప్రతిపాదించింది. కానీ, ఆ నిర్మాణం కార్యరూపం దాల్చలేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుపై నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. కానీ, తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో బరాజ్ నిర్మాణానికి పొరుగు రాష్ట్రం మహారాష్ట్ర అంగీకరించలేదు. ఆ ప్రాజెక్టుకు కావాల్సిన నీటిలభ్యత కూడా అందుబాటులో లేదని వెల్లడించింది.
ఈ అంశాలన్నింటిపై కూలంకషంగా చర్చించి, సుదీర్ఘ మేధోమథనం సాగించిన మాజీ సీఎం కేసీఆర్, తెలంగాణ నీటిరంగ నిపుణులు.. తుదకు తుమ్మిడిహెట్టి వద్ద ఉమ్మడి ఏపీ సర్కారు ప్రతిపాదించిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో కీలక మార్పులు చేశారు. ఆ ప్రాజెక్టును 2 భాగాలుగా విభజించారు. తొలుత నీటిలభ్యత ఆధారంగా మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. తుమ్మిడిహెట్టి వద్ద కూడా బరాజ్‌ను నిర్మించడం ద్వారా 20 టీఎంసీలను ఎత్తిపోసి ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లోని 5 నియోజకవర్గాల పరిధిలో 2 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని ప్రణాళికలు రూపొందించారు. దానికే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత సుజల స్రవంతి ప్రాజెక్టుగా పేరు పెట్టారు.
ముంపు నివారణ కోసం తుమ్మిడిహెట్టి బరాజ్ ఎత్తును 148 మీటర్లకు కుదించి మహారాష్ట్రతో చరిత్రాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అనంతరం అనేక సాంకేతిక కారణాల వల్ల ఆ బరాజ్ నిర్మాణం ముందుకు సాగలేదు. తుమ్మిడిహెట్టి వద్ద 1.5 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో బరాజ్‌ను నిర్మించాలంటే సుమారు 6 కిలోమీటర్ల మేర కాంక్రీట్ నిర్మా ణం చేపట్టాల్సి ఉంటుందని, అదీగాక 100 నుంచి 110 గేట్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని, మొ త్తంగా బరాజ్ నిర్మాణానికి రూ.2,500 కోట్లకుపైగా వెచ్చించాల్సి వస్తుందని అంచనా వేశారు.
మరోవైపు తుమ్మిడిహెట్టి పక్కనే చాప్రాల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉండటం, అక్కడ దాదాపు 2,448 హెక్టార్ల అటవీ భూమి ముంపునకు గురయ్యే ప్రమాదం ఉండటంతో బరాజ్ నిర్మాణానికి అనుమతులు పొందడంలో సీడబ్ల్యూసీ నుంచి ఆటంకాలు ఏర్పడవచ్చని అధికారులు తేల్చిచెప్పారు. దీంతో ఆయా సమస్యలపై నాటి సీఎం కేసీఆర్ మరోసారి ఇంజినీర్లతో సుదీర్ఘ మేధో మథనం సాగించారు. తుదకు బరాజ్‌ను తుమ్మిడిహెట్టి వద్ద కాకుండా వార్ధాపై నిర్మించడమే పరిష్కారమని నిర్ణయించారు. ఆ తర్వాత ఆ ప్రాజెక్టు పేరును డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వార్ధాగా మార్చారు.
తుమ్మిడిహెట్టికి ఎగువన పూర్తిగా వార్ధాపైనే బరాజ్‌ను నిర్మించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పక్కా గా అధ్యయనం చేయించింది. వ్యాప్కోస్ ద్వారా ప్రాథమిక సర్వే చేయించింది. తొలుత నీటి లభ్యతపై లెక్కలు తీయించి వార్ధాలో 58 టీఎంసీల నీటిలభ్యత ఉన్నట్టు తేల్చింది. అందులో వాస్తవానికి కావాల్సినవి 20 టీఎంసీలే. ఈ నేపథ్యంలో వార్ధాపైనే బరాజ్‌ను నిర్మించాలని నిర్ణయించింది. 653 మీటర్ల పొడవుతో బరాజ్ నిర్మించేందుకు దాదాపు రూ.1,000 కోట్లు సరిపోతాయని, తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 1,500 కోట్లపైగా ఆదా అవుతాయని అంచనా వేసిం ది.
అంతేకాకుండా ఎలాంటి ముంపు లేకుండానే దాదాపు 5 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే వెసులుబాటు కలగుతుందని తేల్చింది. అందుకు సంబంధించిన డీపీఆర్‌ను సిద్ధం చేసి సీడబ్ల్యూసీకి నివేదించాలని అధికారులను ఆదేశించింది. వార్ధా బరాజ్‌కు సంబంధించిన డీపీఆర్‌ను సిద్ధం చేసే బాధ్యతను కూడా వ్యాప్కోస్‌కు అప్పగించింది. అనంతరం బరాజ్ నిర్మాణానికే పరిమితం కాకుండా ప్రతిపాదిత ఆయకట్టుకు సంబంధించిన సాగునీటి కాలువలు, కరకట్టలు నిర్మాణాలన్నింటికీ కలిపి మొత్తం రూ.4,550.73 కోట్లతో డీపీఆర్‌ను రూపొందించడంతో ఆ ప్రతిపాదనలకు గత బీఆర్ఎస్ ప్రభుత్వమే ఆమోదం తెలిపింది.
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని గుండాయిపేట గ్రామం, అటు మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా అడేగావ్ గ్రామం మధ్యన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వార్ధా బరాజ్‌ను నిర్మించాలని నిర్ణయించారు. 653 మీటర్ల పొడవు, 12 మీటర్ల ఎత్తు, 27 గేట్లతో రోడ్ కమ్ బరాజ్‌ను సంకల్పించారు. తద్వారా ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో మొత్తం గా 2 లక్షల ఎకరాలకు నీరందించేందుకు ప్రణాళికలను సిద్ధం చేశారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తవ్విన కాలువలను కూడా ఇందులో వినియోగించేలా రూపొందించడం ముఖ్య విషయం. రాష్ట్ర విభజనకు ముందు పాలకులు డబ్బులు దండుకోవడమే లక్ష్యంగా ప్రాజెక్టులు చేపట్టారనడానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టే నిలువెత్తు నిదర్శనం.
అప్పట్లో బరాజ్‌ను నిర్మించకుండానే తొలుత ఈపీసీ విధానంలో కాలువల తవ్వకాన్ని చేపట్టారు. ఇబ్బడిముబ్బడిగా కాంట్రాక్టర్లకు దోచిపెట్టారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా మొత్తంగా తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లి రిజర్వాయర్ వరకు దాదాపు 116 కిలోమీటర్ల కాలువను, 75 మీటర్ల వెడల్పు, 12 మీటర్ల లోతుతో తవ్వాల్సి ఉన్నది. తెలంగాణ ఏర్పాటు నాటికే మొ త్తంగా 75 కిలోమీటర్ల మేర కాలువ తవ్వకం పనులు పూర్తయ్యాయి. ఆ తర్వాత కాలువ అలైన్మెంట్ భూ మిని సింగరేణి కోల్ ఫీల్డ్ కోసం డీమార్కేషన్ చేసింది. మరోవైపు బరాజ్ నిర్మాణం కాకపోవడంతో పూర్తయిన కాలువ సైతం నిరుపయోగంగానే మారింది.
ప్రస్తుతం వార్ధాపై బరాజ్‌ను నిర్మించి అక్కడి నుంచి 20 కిలోమీటర్ల మేర కాలువను తవ్వి తుమ్మిడిహెట్టి దిగువన కుడిమెట్టిగూడెం వద్ద ఇప్పటికే తవ్విన కాలువతో అనుసంధానించనున్నారు. మొత్తంగా ఆ కాలువనే రిజర్వాయర్‌గా మార్చి 1.5 టీఎంసీలను నిల్వ చేయాలని కేసీఆర్ ప్రణాళికలను రూపొందించారు. వరద కాలువ తరహాలోనే ఈ కెనాల్‌ను సైతం జీవధారగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.
కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ సర్కార్ హయాంలోనే ఇంజినీరింగ్ అధికారులు వార్ధా బరాజ్‌కు సంబంధించిన డీపీఆర్‌ను అనుమతుల కోసం కేంద్ర జల సంఘానికి (సీడబ్ల్యూసీ)కి సమర్పించారు. హైడ్రలాజికల్ క్లియరెన్స్‌లు కూడా వచ్చాయి. అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. దీంతో డీపీఆర్‌ను అప్రయిజల్ లిస్ట్ నుంచి తొలగిస్తున్నట్టు వెల్లడిస్తూ సీడబ్ల్యూసీ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. కంప్లయన్స్ రిపోర్ట్‌కు సంబంధించి మూడుసార్లు లేఖలు రాసినా పెండింగ్‌లోనే పెట్టారని పేరొంది.
ఆ ప్రాజెక్టు వల్ల మహారాష్ట్రలో వ్యవసాయ భూములు ముంపునకు గురవుతాయని, రివ్యూ కోసం డీపీఆర్‌ను ఇంటర్ స్టేట్ బోర్డుకు సమర్పించాలని, మహారాష్ట్ర అభిప్రాయాలు, అభ్యంతరాలు తీసుకోవాలని చెప్పినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు స్పందన లేదని తెలిపింది. ఈ నేపథ్యంలోనే డీపీఆర్‌ను అప్రయిజల్ లిస్ట్ నుంచి తొలగిస్తున్నట్టు స్పష్టం చేసింది. సీడబ్ల్యూసీ కోరిన వివరాలను అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం చేసినట్టు తెలుస్తున్నది.
సీఎం రేవంత్‌రెడ్డితోపాటు మంత్రులంతా తుమ్మిడిహెట్టి వద్దనే బరాజ్‌ను నిర్మిస్తామని బాహాటంగానే ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వార్ధా బరాజ్ డీపీఆర్‌ను పక్కనపెట్టారని ఇంజినీర్లు చెప్తున్నారు. మరి ప్రాణహిత బరాజ్పైనైనా చర్యలు చేపట్టారా అంటే అదీలేదు. ఇప్పటివరకు దానిపై మళ్లీ అధ్యయనం చేసింది లేదు. మహారాష్ట్రతో చర్చించింది లేదు. కానీ, అన్నివిధాలా అధ్యయనం చేసి అనుమతులకు తుదిదశలో ఉన్న వార్ధా డీపీఆర్‌ను నిర్లక్ష్యం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం తమ జీవితాలతో చెలగాటమాడుతున్నదని మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల రైతులు మండిపడుతున్నారు.