హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమమే ప్రధానంగా నీళ్ల కోసం జరిగింది అని నీటి పారుదల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ తెలిపారు. కృష్ణా జలవివాదాలకు సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పరస్పర ఫిర్యాదుల నేపథ్యంలో నదీ యాజమాన్య బోర్డు 14వ సమావేశం ప్రారంభానికి కంటే ముందు రజత్ కుమార్ మీడియాతో మాట్లాడారు.
తెలంగాణలో ఎక్కువ ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. తెలంగాణ నీటి అవసరాలు తీరాలంటే విద్యుత్ ఉత్పత్తి అవసరం అని పేర్కొన్నారు. హైదరాబాద్కు ప్రధాన నీటి వనరు కృష్ణా జలాలు మాత్రమే అని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా నదిపై అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తుందని తెలిపారు. రాష్ట్ర అవసరాలతో పోలిస్తే 299 టీఎంసీలు చాలా తక్కువ అని చెప్పారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తలపెట్టిన ప్రాజెక్టే అని ఆయన గుర్తు చేశారు. కృష్ణా నదిపై టెలిమెట్రీలు ఏర్పాటు చేయాలని ఎన్నో ఏళ్లుగా అడుగుతున్నాం. ఏపీ ప్రభుత్వం బేసిన్ వెలుపలకు కృష్ణా జలాలను తరలిస్తోందని రజత్ కుమార్ తెలిపారు.