‘దోని సప్పుడే గాని దొయ్యపారింది లేదు’ అనేది నానుడి. రాష్ట్ర సాగునీటిపారుదలశాఖ దుస్థితి అచ్చం అలానే ఉన్నది. ప్రభుత్వ పెద్దల ఆర్భాటపు ప్రకటనలు.. నిరంతర సమీక్షలు తప్ప ఆచరణలో భిన్నమైన పరిస్థితి నెలకొన్నది. హామీలు తప్ప పైసా విదల్చని కాంగ్రెస్ సర్కారు తీరుతో రెండేండ్లలో ఏ ఒక్క ప్రాజెక్టులో కూడా పురోగతి లేకుండా పోయింది. అన్నింటి సంగతి పక్కనబెడితే ప్రభుత్వమే ప్రాధాన్యతగా ఎంచుకున్న వాటికీ దిక్కులేకుండా పోయింది. ఏటా కొత్తగా 6 లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తామని కాంగ్రెస్ చేసిన వాగ్దానం నీటి మీద రాత మాదిరిగా మారింది. రెండేండ్లలో కనీసం 6 ఎకరాలకు కూడా నీళ్లివ్వలేదంటే కాంగ్రెస్ పాలనలో ‘ఇరిగేషన్’ ఎంత పరేషాన్లో పడిందో తెలిసిపోతున్నది. ప్రాజెక్టుల ప్రగతి పనులకే కాదు.. కనీసం మరమ్మతులకు కూడా నానా తంటాలు పడుతున్న దుస్థితి దాపురించింది. రెండేండ్లలో కాంగ్రెస్ ఒక్క ప్రాజెక్టు అనుమతిని కూడా తీసుకొచ్చింది లేదు. కొత్తగా పూర్తి చేసింది లేదు. పథకాల పరిస్థితి ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్నచందంగా తయారైంది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పలు సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఇప్పటికే 75 శాతం మేరకు పనులు పూర్తయిన మొత్తం 18 ప్రాజెక్టులను ఎంపిక చేసింది. వాటిని ఏ, బీ క్యాటగిరీలుగా విభజించింది. ఏ క్యాటగిరీలోని 6 ప్రాజెక్టులను పూర్తిచేయడం ద్వారా ఆయా ప్రాజెక్టుల పరిధిలో మిగిలిన 47.882 ఎకరాలకు సాగునీరందించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఇక బీ క్యాటగిరీలో మొత్తంగా 12 ప్రాజెక్టులను ఎంపిక చేసింది. మార్చి ఆఖరులోగా పనులు పూర్తి చేసి మొత్తంగా 5.84 లక్షల ఎకరాలకు సాగునీరివ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నది. ఇక ఏ, బీ క్యాటగిరీ ప్రాజెక్టుల పరిధిలో మిగిలిన 25 శాతం పనుల పూర్తికి మొత్తంగా రూ.7647.09 కోట్లు కావాలని అంచనా వేసింది.
బడ్జెట్లోనూ ఆ మేరకు నిధులు కేటాయించింది. ప్రాధాన్యతా ప్రాజెక్టుల్లో పెండింగ్ పనుల పూర్తికి దాదాపు 14,696.26 ఎకరాలు సేకరించాల్సి ఉన్నదని ఇరిగేషన్ శాఖ లెక్కలు చెప్తున్నాయి. ఇందుకు రూ.2500 కోట్లు అవసరమని అంచనా వేశారు. ఇందులో ప్రభుత్వం ఇప్పటివరకు కనీసం 25 శాతం నిధులు కూడా విదిల్చలేదని సాగునీటిశాఖ ఇంజినీర్లే అసహనం వ్యక్తంచేస్తున్నారు. కడెం, సింగూరు, మూసీ, సుద్దవాగు, సంగంబండ, ఎల్టీ బయ్యారం, పెద్దవాగు, కుమ్రంభీం సహా పలు ప్రాజెక్టులకు రూపాయి విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పనులు ఒక్క అడుగు కూడా ముందుకుపడటం లేదని వారు వివరిస్తున్నారు. రెండేండ్లలో ప్రభుత్వం ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదు.
తెలంగాణ సాగునీటిరంగంలో చెరువులది అత్యంత కీలకపాత్ర. అందుకే గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెరువుల పునరుద్ధరణ, పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ వచ్చింది. మిషన్‌కాకతీయ పథకాన్ని ప్రత్యేకంగా చేపట్టి ఏటా బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించింది. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మైనర్ ఇరిగేషన్‌కు నిధుల కేటాయింపును కుదించింది. 2025-26 బడ్జెట్లో మైనర్ ఇరిగేషన్‌కు రూ.950 కోట్లు కేటాయించగా, ఇప్పటికీ రూ.230 కోట్లు కూడా విడుదల చేయలేదు. ఇక మేజర్, మీడియం, మైనర్ ప్రాజెక్టుల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కోసం గత ప్రభుత్వం జీవో 45 ద్వారా ప్రతి బడ్జెట్లో రూ.250 కోట్లకు పైగా కేటాయిస్తూ వస్తే, ప్రస్తుత కాంగ్రెస్ ఆ బడ్జెట్‌ను పూర్తిగా విడుదల చేయడం లేదు.
ఇప్పటికీ ఓఅండ్‌ఎంకు సంబంధించి దాదాపు రూ.170 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. డ్రిప్ (డ్యామ్ రిహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం) కింద 29 ప్రాజెక్టులకు కేంద్రం రూ.645 కోట్ల ఆర్థిక సాయం చేసేందుకు ముందుకొచ్చింది. రాష్ట్ర వాటాగా రూ.110 కోట్లు కేటాయించాల్సి ఉంటే, ఆ నిధులను సర్కారు వెచ్చించడం లేదు. ప్రధాన మంత్రి కృషి సించాయ్ యోజన (పీఎంకేఎస్‌వై) కాడ్వమ్ తదితర కేంద్ర ప్రాయోజిత ప్రాజెక్టులదీ ఇదే దుస్థితి.
గత బీఆర్ఎస్ సర్కారు గోదావరి, కృష్ణా బేసిన్లను కలుపుకొని మొత్తంగా 11 ప్రాజెక్టుల డీపీఆర్‌లను కేంద్రానికి సమర్పించింది. అందులో కాళేశ్వరం ప్రాజెక్టుతోపాటు, చిన్నకాళేశ్వరం, చౌటుపల్లి హనుమంతరెడ్డి, చనాక-కొరాట బరాజ్, గూడెం ఎత్తిపోతలు, మోడికుంటవాగు ప్రాజెక్టుల అనుమతులను విజయవంతంగా తీసుకొచ్చింది. కాంగ్రెస్ వచ్చేనాటికి కేంద్రం వద్ద సీతమ్మసాగర్ మల్టీపర్పస్, సమ్మక్కసాగర్, పాలమూరు రంగారెడ్డి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వార్ధా ప్రాజెక్టు, కాళేశ్వరం 3వ టీఎంసీకి సంబంధించిన డీపీఆర్‌లు పెండింగ్‌లో ఉన్నాయి. అందులో సీతమ్మసాగర్కు మాత్రమే ఇటీవల అనుమతులు వచ్చాయి. మిగతా వేటికీ అనుమతులు రాకపోగా, కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం మూలంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వార్ధా, కాళేశ్వరం 3వ టీఎంసీ డీపీఆర్‌లను సీడబ్ల్యూసీ ఏకంగా తిప్పిపంపింది. అయినా ఆయా ప్రాజెక్టుల అనుమతి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చొరవ చూపింది లేదు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహా, సాగునీటిశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మంత్రులు జిల్లాలు, ప్రాజెక్టులవారీగా సమీక్షల మీద సమీక్షలు చేస్తున్నారే తప్ప ఆచరణలో నిధులు మాత్రం విడుదల చేయడం లేదు. బీఆర్ఎస్ హయాంలోనే నిర్మాణం పూర్తయిన సదర్మాట్ బరాజ్‌ను ప్రారంభించాలని నిరుడు నిర్ణయించారు. కానీ ఇప్పటికీ ప్రారంభించలేదు. ఖమ్మం జిల్లాలో సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగమైన రాజీవ్ కెనాల్‌ను ప్రారంభించి హడావుడి చేసిన ప్రభుత్వం ఇప్పటికీ పెండింగ్ పనుల్లో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. అధికారంలోకి రాగానే ఎస్ఎల్బీసీ పనులు యుద్ధప్రాతిపదికన చేపడుతున్నామని ప్రకటనలు గుప్పించింది.
ఒకసారి సీఎం రేవంత్‌రెడ్డి, పలుమార్లు సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవరికి వారు సమీక్షలు పెట్టారు. అమెరికా వెళ్లి కంపెనీ ప్రతినిధులతో చర్చించి పరికరాలు తెప్పిస్తున్నామని ప్రగల్భాలు పలికారు. క్షేత్రస్థాయి పరిస్థితులపై అధ్యయనం చేయకుండానే పనులు మొదలు పెట్టడంతో వెంటనే సొరంగం కూలిపోయింది. ఎనిమిది మంది కార్మికులు గల్లంతయ్యారు. ఇప్పటికీ ఆరుగురు కార్మికుల మృతదేహాలను కూడా ప్రభుత్వం బయటకు తీసుకురాలేని దుస్థితి ఉన్నది. దాదాపు తొమ్మిది నెలలు గడచినా సొరంగం పునరుద్ధరణ పనులను కూడా ప్రారంభించలేదు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు కాంగ్రెస్ అత్యుత్సాహం చూపింది. తొలుత విజిలెన్స్, ఆ తర్వాత జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్‌తో విచారణ చేయించింది. సీబీఐ విచారణ చేయించాలని నిర్ణయించింది. కమిషన్ల నివేదికలు వచ్చాయి. బరాజ్‌ల పునరుద్ధరణకు ఎన్డీఎస్ఏ సైతం సిఫారసులు చేస్తూ నివేదికలిచ్చింది. ప్రాజెక్టుపై విచారణకు హడావుడి చేసిన సర్కారు, పునరుద్ధరణ పనులను మాత్రం పక్కన పడేసింది. ప్రతి అంశంలోనూ హడావుడి తప్ప రెండేండ్లుగా ఇరిగేషన్‌శాఖలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రగతి శూన్యమనేది స్పష్టమవుతున్నది.
– ఫీచర్ స్టోరీ
