హైదరాబాద్, సెప్టెంబర్5 (నమస్తే తెలంగాణ): ప్రాజెక్టుల్లో జరిగే తప్పులకు సంబంధిత చీఫ్ ఇంజినీర్లదే పూర్తి బాధ్యతని సాగునీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. రాష్ట్రంలో వరద నష్టంపై నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో కలిసి క్షేత్రస్థాయిలోని సీఈలతో జలసౌధ నుంచి గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద నష్టం, ప్రమాదాలను నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్‌పాటిల్, ఈఎన్సీలు అనిల్‌కుమార్, నాగేందర్రావు, హరిరాం, శంకర్, సీఈలు మంత్రికి వివరించారు. వట్టెం, భక్తరామదాసు పంప్‌హౌజ్‌ల మునక, మున్నేరు వరద, సాగర్ ఎడమకాలువకు గండికి గల కారణాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ నిధుల విడుదలలో తీవ్ర జాప్యమవుతున్నదని, ఫలితంగా క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని అధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
అనంతరం మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. వరద ఉధృతిలోనూ విధుల్లో నిమగ్నమైన నీటిపారుదలశాఖ సిబ్బందిని అభినందించారు. వరదలతో 223 చెరువులకు గండ్లు పడ్డాయని, 159 చోట్ల నష్టం వాటిల్లిందని, 112 కాలువలు తెగిపోయాయని, మొత్తంగా 544 చోట్ల డ్యామేజీలు ఏర్పడగా తక్షణ మరమ్మతులకు రూ.113 కోట్లు అవసరమవుతాయని, శాశ్వత మరమ్మతులకు 900 కోట్లకు పైగా నిధులు అవసరమవుతాయని తెలిపారు. తెగిపోయిన చెరువు కట్టలు, కెనాల్స్ పునరుద్ధరణకు వారం రోజుల్లో టెండర్లు పిలిచి అనుమతులు మంజూరు చేయాలని అధికారులను సూచించారు. వట్టెం పంప్‌హౌజ్ మునకపై పూర్తివివరాలతో నివేదికను అందించాలని సీఈ విజయ్‌భాస్కర్‌ను ఆదేశించారు. కాలువలు, చెరువుల పర్యవేక్షణకు 1800 మంది లష్కర్లను నియమించాల్సి ఉంటుందని, ఆ మేర కు ప్రతిపాదనలను పంపించాలని సిబ్బందికి సూచించారు.
ఇటీవల గండిపడిన నాగార్జున సాగర్ ఎడమకాల్వకు తక్షణ మరమ్మతులను చేపట్టేందుకు ప్రభుత్వం రూ.2.10కోట్లతో పరిపాలన అనుమతులను బుధవారం మంజూరు చేసింది.