హైదరాబాద్, ఆగస్టు25 (నమస్తే తెలంగాణ): దేవాదుల ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేయాలని ప్రాజెక్టు అధికారులను సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ జలసౌధలో దేవాదుల ప్రాజెక్టుపై మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక, సీఎం సలహాదారు వేంనరేందర్‌రెడ్డి, ఎంపీ బలరాంనాయక్, ప్రాజెక్టు పరిధిలోని ఎమ్మెల్యేలతో కలసి మంగళవారం ఉత్తమ్ ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రాజెక్టు పనుల పురోగతి వివరాలు, క్షేత్రస్థాయిలో సమస్యలను ప్యాకేజీల వారీగా అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ప్రజాప్రతినిధుల అభిప్రాయాలనూ తెలుసుకొన్న అనంతరం మంత్రి ఉత్తమ్ మాట్లాడారు. ఏడాదిలోగా దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేయడమే ప్రభుత్వం లక్ష్యమని వెల్లడించారు. ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ, ఆర్అండ్ఆర్, అటవీ అనుమతుల సమస్యల పరిషారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, కలెక్టర్లు, నీటిపారుదల ఇంజినీర్లు సమన్వయంతో పనులను ముందుకు తీసుకెళ్లాలని చెప్పారు. భూసేకరణ తదితర అవసరాలకు ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ కింద రూ.6వేల కోట్లను చెల్లించేందుకు సీఎం హామీ ఇచ్చారని, ఇప్పటికే సుమారు రూ.2,500 కోట్లు విడుదల చేశారని వివరించారు. దేవాదుల ద్వారా 38 టీఎంసీల గోదావరి జలాలను ఎత్తిపోసి 6 లక్షల ఎకరాలకు సాగునీరందించడమే ప్రాజెక్టు లక్ష్యమని చెప్పారు. రూ.33 కోట్ల అంచనా వ్యయంతో రామప్ప-లక్నవరం లింక్ కెనాల్ పనులను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.