మూలిగే నక్కపై మరో తాటిపండు పడింది! ఇప్పటికే వేల కోట్ల ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన జలమండలిపై తాగునీటి పథకాల రుణ భారం మోయలేనిదిగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా మరో పిడుగులాంటి భారం పడేందుకు రంగం సిద్ధమైంది. మహానగరానికి నిరంతర తాగునీటి కోసం రూ.2 వేల కోట్లకు పైగా వెచ్చించి చేపట్టిన సుంకిశాల పథకం నిర్మాణ సంస్థ మేఘా నిర్వాకంతో కుప్పకూలింది కదా.. ఆ జాప్యానికి మూల్యంగా జలమండలిపై దాదాపు రూ.160 కోట్లకు పైగా భారం పడుతున్నది.
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): నగరానికి కృష్ణాజలాలను సరఫరా చేసేందుకు ముడినీటిని సేకరించే నల్లగొండ జిల్లాలోని ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (ఏఎమ్మార్పీ)లోని సిస్టర్న్ (చిన్న రిజర్వాయర్) వద్ద లీకేజీలు పెరగడంతో మరమ్మతులు చేపట్టాలని నీటిపారుదల శాఖ నిర్ణయించింది. మూడు లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టు ఆధారపడి ఉన్నందున రానున్న వర్షాకాలం పంటల పెరగడంతో మరమ్మతులు చేపట్టాలని నీటిపారుదల శాఖ నిర్ణయించింది. మూడు లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టు ఆధారపడి ఉన్నందున రానున్న వర్షాకాలం పంటల సీజన్‌లోగా సిస్టర్న్‌ను సిద్ధం చేయాల్సి ఉన్నందున హైదరాబాద్ తాగునీటికి ప్రత్యామ్నాయాన్ని చేసుకోవాలని జలమండలికి సూచించింది. మరి.. శాశ్వత ప్రత్యామ్నాయమైన సుంకిశాల పథకం మరో ఏడాదికీ అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపించకపోవడంతో ఏఎమ్మార్పీలో ఐదో మోటరు భారాన్ని మోయడం అనివార్యంగా మారింది. అటు సుంకిశాల జాప్యంతో అంచనా వ్యయాన్ని పెంచి ఇలా రూ.160 కోట్లకు పైగా భారాన్ని మోపి సదరు నిర్మాణ సంస్థ జలమండలిని మూడు చెరువుల నీళ్లు తాగిస్తుందనేది సుస్పష్టం.
తర్జనభర్జన పడి..
హైదరాబాద్ మహానగరానికి సరఫరా అవుతున్న కృష్ణా, గోదావరి, సింగూరు-మంజీరా, జంట జలాశయాల జలాల్లో దాదాపు 48 శాతం కృష్ణాజలాలే ఉంటాయి. జలమండలి రోజుకు సుమారు 565 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తుండగా ఇందులో రోజుకు 270 మిలియన్ గ్యాలన్లు నాగార్జునసాగర్ నుంచి తరలిస్తున్నవే. నల్లగొండ జిల్లాలోని ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (ఏఎమ్మార్పీ)లోని మోటర్ల ద్వారా కృష్ణా నది నుంచి ఎత్తిపోసిన జలాలను కోదండాపూర్ వద్ద ట్రీట్మెంట్ ప్లాంటులో శుద్ధి చేసి ఆపై నగరానికి సరఫరా చేస్తారు. మాధవరెడ్డి ప్రాజెక్టులో మోటర్లు నీటిని ఎత్తిపోసే దగ్గర చిన్న రిజర్వాయర్ (సిస్టర్న్) ఉన్నది. ఈ సిస్టర్న్ పారాపెట్ గోడ వద్ద భారీగా లీకేజీలు ఏర్పడ్డాయి. వాస్తవానికి ప్రాజెక్టు మొదలైన 2001లోనే ఇక్కడ లీకేజీలను గుర్తించారు. దీంతో తరచూ మరమ్మతులు చేస్తూ వస్తున్నారు. హైదరాబాద్ తాగునీరు, మూడు లక్షల ఎకరాలకు సాగునీరు.. ఇలా ఏడాది పొడవునా ప్రాజెక్టులోని నాలుగు మోటర్ల ద్వారా 2400 క్యూసెక్కుల కృష్ణా జలాలను మోటర్లు ఇందులోకి ఎత్తిపోస్తుంటారు. సరిగ్గా ప్రాజెక్టు పంపుహౌస్ ముందు ఎత్తు గుట్టపై ఉన్న ఈ సిస్టర్న్‌కు ఏదైనా ప్రమాదం జరిగితే పంపుహౌస్ పూర్తిగా మునిగిపోయే ప్రమాదమున్నది. అందుకే సిస్టర్న్‌కు మరమ్మతులు చేయాలని నీటిపారుదల శాఖ నిర్ణయించినా హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం మోటర్లను నిలిపివేసే పరిస్థితి లేకుండా పోయింది. అందుకే రెండు నెలలుగా అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఎట్టకేలకు తాజాగా సిస్టర్న్ మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించినందున ప్రత్యామ్నాయం చూసుకోవాలని జలమండలికి సూచించారు.
హైదరాబాద్‌కు ఏఎమ్మార్పీనే శరణ్యం
అసలు ఏఎమ్మార్పీపై ఆధారపడకుండా నేరుగా నాగార్జునసాగర్ జలాశయంలో డెడ్‌స్టోరేజీ ఉన్నా ఫోర్‌షోర్ నుంచి కోదండాపూర్‌లోని జలమండలి ప్లాంటుకు కృష్ణాజలాలను తరలించే శాశ్వత పరిష్కారంగా కేసీఆర్ ప్రభుత్వం సుంకిశాల పథకాన్ని చేపట్టింది. 80 శాతం పనులు పూర్తి చేయగా గత 16 నెలల్లో సక్రమంగా పనులు జరిగి ఉంటే ఇప్పటికే పథకం అందుబాటులోకి వచ్చి ఉండేది. ఏఎమ్మార్పీతో సంబంధం లేకుండానే హైదరాబాద్‌కు కృష్ణాజలాలు వచ్చేవి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం సరైన పర్యవేక్షణ చేయకపోవడం.. జలమండలి ఇంజినీర్ల నిర్లక్ష్యం తోడై నిర్మాణ సంస్థ మేఘా ఇన్ఫ్రా తప్పుడు అంచనాతో నిరుడు ఆగస్టు 2న రిటెయినింగ్ వాల్ కుప్పకూలి, సుంకిశాల పథకం పంపుహౌస్ నీట మునిగింది. దాదాపు ఏడు నెలల పాటు పనులు నిలిచి.. కొన్నిరోజుల కిందటే పనుల పునరుద్ధరణ జరిగింది. ఐదారు నెలల్లోనే పథకం పనులు పూర్తవుతాయని అధికారులు చెప్తున్నా నిరుడు జరిగిన ప్రమాదం దృష్ట్యా పథకం అందుబాటులోకి వచ్చేందుకు కనీసం వచ్చే ఏడాది మార్చి అవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో ప్రత్యామ్నాయంగా సిస్టర్న్తో సంబంధం లేకుండా ప్రాజెక్టులో ఐదో మోటరును ఏర్పాటు చేసి హైదరాబాద్‌కు తాగునీటిని కొనసాగించాలని నీటిపారుదల శాఖ నిర్ణయించింది.
కనీసంగా రూ.160 కోట్ల ఖర్చు
ఏఎమ్మార్పీలో నాలుగు మోటర్ల ద్వారా నాగార్జునసాగర్ నుంచి కృష్ణాజలాలను ఎత్తిపోసి సిస్టర్న్‌లో పోస్తారు. ఐదో మోటరును సిస్టర్న్‌కు సంబంధం లేకుండా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మోటరు ఎత్తిపోసే నీటిని డెలివరీ మెయిన్స్ ద్వారా నేరుగా సిస్టర్న్ తర్వాత హెడ్ రెగ్యులేటర్ దిగువన లింక్ కెనాల్లో పోస్తారు. 18 మెగావాట్ల సామర్థ్యంతో కొత్త పంపు మోటరుతో పాటు దాదాపు కిలోమీటరు వరకు డెలివరీ మెయిన్స్‌కు రూ.160 కోట్లకు పైగా ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. ఏఎమ్మార్పీ అనేది నీటిపారుదల శాఖ పరిధిలోకి వస్తున్నందున వ్యయాన్ని జలమండలి భరిస్తే పనుల నిర్వహణ నీటిపారుదల శాఖ చేపట్టనున్నది. సిస్టర్న్ మరమ్మతులకు సుమారు మూడు నెలల సమయం పడుతుందని గతంలో నీటిపారుదల శాఖ ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. అప్పటివరకు ఐదో మోటరు ద్వారా హైదరాబాద్ తాగునీటి వ్యవస్థకు కృష్ణాజలాలను అందించనున్నారు.‘