హైదరాబాద్, డిసెంబర్6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా నీటిపారుదలశాఖ భూముల పరిరక్షణకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటామని పదేపదే ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ ప్రభుత్వమే ఇప్పుడు భూమిని హాంఫట్ చేస్తున్నది. ఉన్నతలక్ష్యాలతో ఏర్పాటు చేసిన నీరు, భూమి యాజమాన్య, శిక్షణ, పరిశోధనా సంస్థ (వాలంతరీ)తోపాటు తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగ్ పరిశోధన ల్యాబొరేటరీ (టీజీ ఈఆర్ఎల్ ) సంస్థలకు చెందిన దాదాపు రూ.4వేల కోట్ల విలువైన భూములపై కన్నేసింది. మూసీ రివర్ ఫ్రంట్‌కు బదలాయించింది. ఆ రెండు సంస్థలకు ప్రత్యామ్నాయంగా ఎందుకు కొరగాని ఫ్యూచర్‌సిటీలో అరకొరగా భూమించి కేటాయించింది. సర్కారు తీరుపై ఇరిగేషన్‌శాఖ వర్గాలు తీవ్ర ఆగ్రహంతో అభ్యంతరం తెలుపుతున్నాయి. నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
లక్ష్యం నీరుగార్చేలా తరలింపు..
నిజాం హయాంలో ఇంజినీరింగ్ ల్యాబొరేటరీని ఏర్పాటు చేశారు. దేశంలోనే అత్యంత పురాతన పరిశోధనా సంస్థ ఇది. హైడ్రాలిక్ నిర్మాణాల నమూనా అధ్యయనాలు, జలాశయాల్లో పూడిక ఏ మేరకు చేరింది…? నీటి నిల్వ సామర్థ్యం ఎంత తగ్గిందనే అంశంపై అది అధ్యయనాలు చేస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టుల పనులు, కన్సల్టెన్సీ సేవలు, మదింపు, ప్రభావ నివేదికలు తయారు చేయడంతోపాటు క్షేత్రస్థాయిలో సామర్థ్యం పెంచే శిక్షణ సంస్థలను స్థాపించడం, నిర్వహణ బాధ్యతల కార్యకలాపాలు నిర్వర్తిస్తున్నది. అలాగే నీటి పారుదలశాఖలో నియమితులైన ఇంజినీర్లకు నియామక, స్కిల్ డెవలప్మెంట్, ఆధునిక టెక్నాలజీపై శిక్షణ ఇవ్వడం, రైతులు, ఇంజినీర్లకు నీటి యాజమాన్యం, పంటల ఉత్పత్తిపై అవగాహన వాలంతరీ ప్రధాన లక్ష్యం. 1983లో దీనిని ఏర్పాటు చేశారు.
వాలంతరి, టీజీఈఆర్ఎల్కు సంస్థలకు కలిపి హైదరాబాద్‌లోని గండిపేట, రాజేంద్రనగర్ పరిధిలో ఉన్న గండిపేట సమీపంలోని హిమాయత్‌సాగర్, కిస్మత్పురాలతో పాటు రాజేంద్రనగర్ పరిధిలోని ఇసా నది ఒడ్డున దాదాపు 454.30 ఎకరాల భూమిని గతంలో కేటాయించారు. అక్కడే అయితే ఇంజినీర్ల శిక్షణ కోసం ఆడిటోరియాలు, క్లాసురూములతోపాటు అన్ని మౌలిక వసతులను కల్పించారు. రెండు సంస్థలను అక్కడే ఏర్పాటు చేయడానికి ప్రత్యేక కారణం కూడా ఉన్నది. ఇంజినీర్లకు శిక్షణ ఇవ్వాలంటే నది పక్కన, డ్యామ్ పక్కన ఉండాలనేది ప్రధాన నిబంధన. దేశంలోని ప్రతి వాల్మీ సెంటర్ అలాంటి లొకేషన్లలోనే ఎంపిక చేసి ఏర్పాటు చేశారు. కానీ ప్రస్తుతం నిబంధనలకు విరుద్ధంగా ఈ రెండు సంస్థలను అక్కడి నుంచి తరలించాలని కాంగ్రెస్ సర్కారు నిర్ణయించింది. సంస్థకు చెందిన భూమిని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్కు బదలాయించి, సంస్థలకు నామమాత్రపు భూమిని ప్రాజెక్టులు లేని ప్యూచర్సిటీలో కేటాయించి చేతులు దులుపుకొన్నది.
ఇరిగేషన్‌శాఖ వర్గాల ఆగ్రహం
ప్రభుత్వం రెండు సంస్థలకు ఫ్యూచర్‌సిటీలో అదీ నామమాత్రంగా భూములను కేటాయించడంపై ఇరిగేషన్‌శాఖ వర్గాలు తీవ్రంగా ఆక్షేపిస్తున్నాయి. నది పక్కన, వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సమీపంలో ఉంటే పరిశోధనలకు, శిక్షణకు ప్రయోజనకరమనే ఉద్దేశంతోనే నాడు సంస్థలను అక్కడ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. వాల్మీ సంస్థల ఏర్పాటు నిబంధనల్లో అది ప్రధానమైనదని వివరిస్తున్నారు. సంస్థ ఎంతో ప్రాచుర్యం పొందిందని గుర్తు చేస్తున్నారు. 2011లో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వమే సంస్థ ప్రాముఖ్యతను తగ్గించే కుట్రలకు తెరతీసిందని, నాన్‌ఫోకల్ కోసం అధికారుల కేటాయించి, సంస్థను శిక్షణకు పరిమితం చేసిందని మండిపడుతున్నారు. రేవంత్‌రెడ్డి సర్కారు ఏకంగా సంస్థలను నిర్వీర్యం చేసేందుకే పూనుకుందని నిప్పులు చెరుగుతున్నారు. సంస్థల లొకేషన్ మార్పు అనాలోచిత నిర్ణయమని తెలుపుతున్నారు. మూసీ ప్రాజెక్టు సైతం గ్రీనరీకి సం బంధించినదేనని, సంస్థల భవనాలను వదిలేసి, భూమిని గ్రీనరీ కోసం వాడుకోవచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు. కావాలనే కొత్త ప్రదేశంలో, కొత్త భవనాలను నిర్మించాలని చూడడంలోనే సర్కారు దురుద్దేశాలు తెలుస్తున్నాయని ఇరిగేషన్‌వర్గాలు ధ్వజమెత్తుతున్నాయి. భూములు స్వాహా చేసేందుకే తప్ప మరే మీ లేదని స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
దాదాపు రూ.4వేల కోట్లు..
వాలంతరి, టీజీఈఆర్ఎల్కు చెందిన భూమి ఔటర్ రింగు రోడ్డును ఆనుకుని ఉన్నది. ఎకరాకు తక్కువలో తక్కువగా రూ.10కోట్ల చొప్పున విక్రయించినా దాదాపు రూ.3వేల కోట్ల దాకా ఆదాయం వస్తుందనే అంచనా. ఎకరా భూమిని లేఅవుట్‌గా అభివృద్ధి చేస్తే 2,900 గజాల స్థలాన్ని ప్లాట్లుగా విక్రయించే అవకాశముంది. అక్కడ దాదాపు గజం 75 వేల నుంచి రూ.లక్ష వరకు పలుకుతున్నది. ఆ లెక్కనైనా ప్రస్తుతం ఆ సంస్థల భూమి విలువ దాదాపు 4వేల కోట్లకుపైగానే ఉంటుందనేది అంచనా. కేవలం సంస్థల భూములను హాంఫట్ చేసేందుకే ప్రభుత్వం మూసీ రివర్ ఫ్రంట్‌లో చేర్చిందని ఇరిగేషన్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. విలువైన, తెలంగాణ భవిష్యత్ ప్రయోజనాలకు ఎంతో అవసరమైన భూములను అభివృద్ధి పేరిట సంస్థలకు కట్టబెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిందని పేర్కొంటున్నాయి.