హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సాగునీటి దినోత్సవ సంబురాలు అంబరాన్నంటాయి. రాష్ట్రంలోని ప్రముఖ ప్రాజెక్టులను, డ్యామ్‌లను విద్యుత్తు దీపాలతో అలంకరించగా.. అవి శోభాయమానంగా వెలుగులీనుతున్నాయి. అన్ని నియోజకవర్గాల్లో ఉదయం 10 గంటల నుంచే కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో గడిచిన తొమ్మిదేండ్లలో సాగునీటి రంగంలో సాధించిన ప్రగతిపై నియోజకవర్గాలవారీగా రూపొందించిన నివేదికలను విడుదల చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ పథకం, సాధించిన ఫలితాలపై రూపొందించిన డాక్యుమెంటరీలను ప్రదర్శించారు. అన్నారం బరాజ్ వద్ద ఏర్పాటుచేసిన ప్రత్యేకంగా లేజర్ షోను కనువిందు చేసింది. రంగనాయకసాగర్, మల్లన్నసాగర్ వద్ద నిర్వహించిన కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. రాష్ట్రస్థాయిలో, టెరిటోరియల్ స్థాయిలో పలువురు ఇంజినీర్లకు ప్రత్యేక అవార్డులను ప్రదానం చేశారు.
గొప్ప విజన్ ఉన్న నేత సీఎం కేసీఆర్: గుత్తా
గొప్ప విజన్ ఉన్న నేత సీఎం కేసీఆర్ కారణంగానే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి చెప్పారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో బుధవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి సాగునీటి దినోత్సవంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో సాగుకు నీళ్లు లేక భూములు పడావు పడ్డాయని గుర్తు చేశారు. నేడు నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణంగా మారిందని చెప్పారు. కార్యక్రమంలో ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్‌కుమార్, సీఎంవో ఓఎస్డీ శ్రీధర్‌దేశ్‌పాండే, తెలంగాణ వాటర్ రిసోర్సెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వీ ప్రకాశ్‌రావు, ఇరిగేషన్ కార్పొరేషన్ చైర్మన్, సముద్రాల వేణుగోపాలాచారి అధికారులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు
సాగునీటి దినోత్సవంలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రవీంద్రభారతిలో చీఫ్ ఇంజినీర్ అనిత, డీఈఈ రమాదేవి నేతృత్వంలో మహిళా ఇంజినీర్లు బతుకమ్మలు ఆడారు. కోలాటాలు ఆడగా అందరిని ఊర్రూతలూగించాయి. సాగునీటి రంగం సాధించిన ప్రగతి, నిర్మించిన ప్రాజెక్టులకు తదితర వాటికి సంబంధించి ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ కూడా కనువిందు చేసింది. నియోజకవర్గ కేంద్రాల్లో కూడా మహిళా ఉద్యోగులు సంబురాలను నిర్వహించారు.
పాల్గొన్న మంత్రులు, ప్రజాప్రతినిధులు
రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సాగునీటి దినోత్సవంలో మంత్రులతోపాటు, స్థానిక ప్రజాప్రతినిధులందరూ పాల్గొన్నారు. బాన్సువాడలో నిర్వహించిన సాగునీటి దినోత్సవంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, నార్కట్‌పల్లిలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ములుగు జిల్లాలో మంత్రి కేటీఆర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మంత్రి సత్యవతిరాథోడ్, పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్‌రావు, నిర్మల్‌లో ఇంద్రకరణ్‌రెడ్డి, ధర్మపురిలో కొప్పుల ఈశ్వర్, కరీంనగర్లో గంగుల కమలాకర్, బాల్కొండలో వేముల ప్రశాంత్‌రెడ్డి, సిద్దిపేట, సంగారెడ్డిలో మంత్రి హరీశ్‌రావు, సూర్యాపేటలో మంత్రి జగదీశ్‌రెడ్డి, నిజామాబాద్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. సాగునీటిరంగంలో తెలంగాణ సాధించిన ప్రగతి నివేదికలను విడుదల చేశారు. వేడుకల్లో ఈఎన్సీలు హరిరామ్, నల్లా వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
ప్రాజెక్టుల నిర్మాణానికి వేల కోట్ల నిధులు
స్వరాష్ట్రంలో సాగునీటి రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి కేసీఆర్ ప్రభుత్వం రూ.లక్షా 70 వేల కోట్లు వెచ్చించిచింది. కాళేశ్వరం ద్వారా 13 జిల్లాల్లో 50 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతున్నది. రైతుల కోసం 24 గంటల విద్యుత్తుతోపాటు ఎన్నో సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారు.
–పోచారం శ్రీనివాసరెడ్డి, అసెంబ్లీ స్పీకర్
స్వరాష్ట్రంలోనే సాగునీటి విప్లవం
ముఖ్యమంత్రి కేసీఆర్ ద్వారా స్వరాష్ట్రంలోనే సాగునీటి విప్లవం ప్రారంభమైంది. కృష్ణ, గోదావరి, పెన్‌గంగ తదితర నదులపై పెద్దఎత్తున ప్రాజెక్టులు, లిప్ట్‌లు నిర్మించడంతో పుష్కలమైన జలసంపద పెరిగింది. గోదావరిపై కాళేశ్వరం ప్రాజెక్టును అతి తక్కువ కాలంలో నిర్మించిన ఘనత ప్రపంచ చరిత్రలోనే తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుంది.
– అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, రాష్ట్ర పర్యావరణ మంత్రి
తెలంగాణ ఆకలిని తీర్చిన కేసీఆర్
రాష్ట్రంలో సాగునీటిని పారించి రైతులు, ప్రజల ఆకలిని సీఎం కేసీఆర్ తీర్చారు. వనపర్తికి నీళ్ల కరువు రావొద్దన్నదే నా జీవిత లక్ష్యం. అన్ని వాగులపై 15 చెక్‌డ్యాంలను నిర్మించగా.. నేడు ఆ నీటితో రైతులు సిరుల పంటలు పండిస్తున్నారు. ఎండాకాలంలోనూ జలకళ సంతరించుకోగా.. పిల్లలు, యువత సరదాగా ఈత కొడుతున్నారు.
– సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి
60 ఏండ్ల గోస తీర్చిన సీఎం కేసీఆర్
అరవై ఏండ్ల సాగునీటి గోసను తీర్చిన దార్శనికుడు సీఎం కేసీఆర్. తలాపున పారుతుంది గోదారి – మన చేను మన చెలుక ఎడారి అని నాడు పాటలు పడుకున్నాం. నేడు చెరువులు, చెక్ డ్యామ్‌లు, కాలువలు, రిజర్వాయర్లు మండుటెండల్లో నిండుగా ఉన్న నీళ్లతో రైతులంతా సంబురంగా ఉన్నారు. ఇదంతా కేసీఆర్ నిర్విరామ కృషి, అకుంఠిత దీక్షతోనే సాధ్యమైంది.
– మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి
‘పాలమూరు’ సాగునీళ్లు పారిస్తాం
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి సాగునీళ్లు పారిస్తాం. లిఫ్ట్ పరిధిలోని కరివెన, ఉదండాపూర్ రిజర్వాయర్లు పూర్తయితే మహబూబ్‌నగర్ సస్యశ్యామలం అవుతుంది. తెలంగాణ ఏర్పడ్డాక ఇరిగేషన్‌శాఖ పనితీరు అద్భుతంగా ఉన్నది. సాగునీరు పుష్కలం కావడంతో వ్యవసాయం పండుగలా మారింది.. గ్రామాల్లోనే ఉపాధి పెరిగి వలసలు బంద్ అయ్యాయి.
– శ్రీనివాస్‌గౌడ్, క్రీడలశాఖ మంత్రి
తెలంగాణ ప్రగతికి చిహ్నం ‘కాళేశ్వరం’
తొమ్మిదేండ్లలో తెలంగాణలో సాగునీటి రంగంలో చారిత్రక పురోగతి సాధించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుంది. నాడు కరువు పరిస్థితుల నుంచి నేడు దేశానికి అన్నం పెట్టే స్థాయికి తీసుకొచ్చారు. తెలంగాణ ప్రగతికి కాళేశ్వరం ప్రాజెక్టు చిహ్నంగా మారింది. తెలంగాణ ప్రభుత్వంలో అమలవుతున్న రైతు సంక్షేమ పథకాలు దేశంలో మరే రాష్ట్రంలో కూడా అమలు కావడం లేదు.
– సత్యవతి రాథోడ్, మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి
కేసీఆర్ లేని తెలంగాణ ఎక్కడిది?
ఎడారిగా మారబోతున్న తెలంగాణను సస్యశ్యామలం చేసి గోదావరినే మెప్పించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌ది. ఆయన లేని తెలంగాణ ఎక్కడిది. కాళేశ్వరం ప్రాజెక్టులో కష్టపడిన ప్రతి ఒక్కరిని గుర్తించి సత్కరించిన ఘనత కూడా సీఎం కేసీఆర్‌దే. రాష్ట్రం ఏర్పడిన తొమ్మిదేండ్లలో సాగు, తాగు, విద్యుత్తు, విద్య, ఉపాధి రంగాల్లో దేశంలోనే తెలంగాణను మేటిగా కేసీఆర్ తీర్చిదిద్దారు.
– పల్లా రాజేశ్వర్‌రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు
మిషన్ కాకతీయకు ప్రశంసలు
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఏనాడూ కాల్వల నీటికి నోచుకోని ప్రాంతాల్లోనూ తెలంగాణ ప్రభుత్వ హయాంలో జలసిరులు కురుస్తున్నాయి. మిషన్ కాకతీయ పథకం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకొని చరిత్రను తిరగరాసింది. ఇప్పుడు ఏగ్రామానికి వెళ్లి చూసినా చెరువులు, కుంటలు నిండు వేసవిలో సైతం నిండు కుండల్లాగా కనిపిస్తున్నాయి.
– కొప్పుల ఈశ్వర్, ఎస్సీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి