వరంగల్, జూలై 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ ప్రభుత్వం ‘వరద’ లెక్కలను గోదావరిలో కలుపుతున్నదా? రేవంత్‌రెడ్డి ప్రభుత్వం గోదావరిలో నీళ్లులేవని బుకాయించే పనిచేస్తున్నదా? నీటిపారుదల శాఖ భుజం మీద తుపాకీ పెట్టి రైతాంగాన్ని కాల్చివేయాలని తలపోస్తున్నదా? అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి. ఎగువన మహారాష్ట్రలో కరుస్తున్న వర్షాలతో రెండు, మూడు రోజులుగా గోదావరికి వరద పోటెత్తుతున్నది. అందుకు శుక్రవారం సా యంత్రం భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని కాళేశ్వర ముక్తీశ్వర ఆలయం వద్ద గోదావరి వరద ప్రవాహమే ఇందుకు నిదర్శనం.
ఆలయం సమీపంలోని వీఐపీ ఘాట్ వద్ద ఉన్న మెట్లను గోదావరి తాకింది. వీఐపీ ఘాట్ వరకు గోదావరి నీరుచేరింది అంటేనే కనీసం 80వేల నుంచి లక్షల క్యూసెక్కులు ఉన్నట్టు లెక్క అని నీటిపారుదల శాఖ గతంలో అనేక సందర్భాల్లో వెల్లడించింది. కానీ, అదే శాఖ ఇప్పుడు అదే గోదావరి వరద ప్రవాహ అంచనాలను తగ్గించి చెప్తున్నదని నాటి పరిణామంతో తేలిపోయింది. మూడు, నాలుగు రోజులుగా మహారాష్ట్రలో వానలు కురుస్తున్నాయి.
గత వారం రోజులుగా మేడిగడ్డ బరాజ్ వద్ద నుంచి 20 వేల క్యూసెక్కుల నుంచి 22 వేల క్యూసెక్కుల వరకు మాత్రమే (శుక్రవారం 22,200 క్యూసెక్కులు) వరద పోతుందని నీటిపారుదల శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. ప్రత్యేకించి ఈనెల 5వ తేదీన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కన్నెపల్లి పంప్‌హౌస్ సమీపంలోని గోదావరి నదిని పరిశీలించారు. దాదాపు 1 లక్ష క్యూసెక్కుల నీరు వృథాగా కిందికి పోతుందని ధ్వజమెత్తిన విషయం తెలిసిందే. కేటీఆర్ పర్యటన అనంతరం నీటిపారుదల శాఖ మేడిగడ్డ వద్ద వరద ప్రవాహాన్ని తగ్గించి చెప్తున్నదని తాజా పరిణామంతో తేలిపోయింది.
మేడిగడ్డ బరాజ్‌కు దిగువన దాదాపు 55 కి.మీ. దూరంలో ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం వద్ద ఉన్న సమ్మక్క బరాజ్‌పై నుంచి శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు 65,300 క్యూసెక్కల వరద పోటెత్తిందని అదే నీటిపారుదల శాఖ వెల్లడించింది. ఇందులో దేవాదుల మూడు దశల్లో ఉన్న 9 పంపుల ద్వారా 2,306 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తూనే దాదాపు 63వేల (62,996 క్యూసెక్కుల) నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కాళేశ్వరం ఆలయం నుంచి సమ్మక్క బరాజ్ వరకు 55 కి.మీ. దూరం. మేడిగడ్డ బరాజ్ నుంచి దిగువన దాదాపు 15 కి.మీ. దూరంలో దమ్మూరు (భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం).. అటు సోమునూర్ (మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరోంచ తాలూకా) వద్ద ఇంద్రావతి నది గోదావరిలో కలుస్తుంది. ఇలా గోదావరిలో ఇంద్రావతి నది కలువడం ద్వారా సమ్మక్క బరాజ్ వద్ద నీటి ప్రవాహం పెరుగుతుందని భావించే అవకాశం ఉన్నది. ఒకవేళ అదే నిజమైతే శుక్రవారం ఉదయం నుంచి కాళేశ్వరం ఆలయం సమీపంలోని గోదావరి వరద ప్రవాహం గంట గంటకూ పెరుగుతూ రాత్రి 7 గంటల వరకు వీఐపీ ఘాట్ వద్ద ఉన్న మెట్ల వరకు చేరితే మేడిగడ్డ బరాజ్ వద్ద మాత్రం అదే 22 వేల క్యూసెక్కులు అని నీటిపారుదల శాఖ పేర్కొనడంలోని ఆంతర్యం ఏంది? అన్నది తేలాల్సి ఉన్నది.
ఇప్పటిదాకా ఎన్డీఎస్ఏను బూచిగా చూపి రాష్ట్ర రైతాంగానికి నీళ్లు ఇవ్వకుండా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి అదే ఎన్డీఎస్ఏ సమాధానం చెంపపెట్టులా మారింది. ‘నీళ్లు ఎత్తిపోయడం ప్రభుత్వానికి సంబంధించిన విషయం దాంతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఎన్డీఎస్ఏ తేల్చిచెప్పింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందునుయ్యి వెనుక గొయ్యి’లా మారింది. ‘గోదావరిలో నీళ్లులేవు’ అని విస్తృత ప్రచారంలో పెట్టడం, అసలు నీళ్లున్నా రైతులకు తెలియకుండా ఉండేందుకు నీటిపారుదల శాఖ విడుదల చేసే లెక్కల్లో ‘అసలు దాచి’ అబద్ధాన్ని వెల్లడించాలనే మౌఖిక ఆదేశాలు వచ్చాయని తెలిసింది. వాటి ఆధారంగానే మేడిగడ్డ బరాజ్ వద్ద వరద లెక్కలను కప్పిపుచ్చుతున్నారని విశ్వసనీయవర్గాల సమాచారం.