Irrigation AE | పెద్దపల్లి, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): 90 వేల విలువ గల పనికి 45 వేల లంచం డిమాండ్ చేసిన పెద్దపల్లి జిల్లాకు చెందిన నీటిపారుదల శాఖ ఏఈ సోమవారం ఏసీబీకి చిక్కాడు. వానకాలంలో వచ్చిన వరదలతో జూలపల్లి మండల కాచాపూర్ సమీపంలోని డీ-83 ప్రధాన కాలువపై రైట్ సైడ్ బండ్‌కు దిగువన బ్రిడ్జికి బుంగ పడింది. ఈ పని పూర్తి చేసేందుకు ఇరిగేషన్ శాఖ రూ.91,703కు టెండర్లను పిలిచింది. ధర్మారం మండలం దొంగతుర్తికి చెందిన తమ్మడబోయిన శ్రీనివాస్ టెండర్ దక్కించుకుని పని పూర్తిచేశాడు. బిల్లు కోసం ఇరిగేషన్ కార్యాలయం చుట్టూ తిరగడం ప్రారంభించాడు.
ఎంబీ రికార్డ్ చేయాల్సిన ఏఈ ఓంకారం నర్సింగరావు పని విలువలో సగం రూ.45 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. చివరకు రూ.20 వేలు ఇవ్వడానికి ఏఈతో ఒప్పందం కుదిరింది. సోమవారం ఉదయం రూ.20 వేలతో పెద్దపల్లికి చేరుకున్న కాంట్రాక్టర్ ఆ తరువాత ఏఈకి ఫోన్ చేశాడు. కలెక్టరేట్ కమాన్‌కు ఎదురుగా ఉన్న టీ స్టాల్ వద్దకు రావాలని సూచించగా, అక్కడి వెళ్లి డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు ఏఈ నర్సింగరావును రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి ఏఈని అదుపులోకి తీసుకున్నట్టు ఏసీబీ డీఎస్పీ బీవీ రమణమూర్తి తెలిపారు.