హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): విశ్రాంత ఇంజినీరు, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టుల సలహాదారు నల్లవెల్లి రంగారెడ్డి ఇటీవల ఇంట్లో కాలు జారి పడడంతో మాదాపూర్ యశోద వైద్యశాలలో చేరారు. మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ వల్ల పరిస్థితి విషమించి సోమవారం తుదిశ్వాస విడిచారు. నాగర్‌కర్నూల్ మండలం గన్యాగులకు చెందిన ఆయనకు ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో మంగళవారం రంగారెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబసభ్యులు వెల్లడించారు. ఎస్ఈగా పదవీ విరమణ చేసిన రంగారెడ్డి మాజీ సీఎం కేసీఆర్‌కు పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ సీం ఓఎస్డీగా సేవలందించారు. కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల రూపకల్పన, నిర్మాణంలో ముఖ్యపాత్ర పోషించడంతోపాటు ఏఎమ్మార్పీఎస్ఎల్బీసీలోనూ సేవలందించారు. ప్రభుత్వం ఇటీవల ఆయనను పాలమూరు ప్రాజెక్టుల సీనియర్ సలహాదారుగా నియమించగా ఆరోగ్యం కుదుటపడ్డాక బాధ్యతలు స్వీకరించాలని రంగారెడ్డి భావించారు.
సీఎం సంతాపం
రంగారెడ్డి మృతికి సీఎం రేవంత్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. నారాయణపేట -కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేయడానికి ఇటీవలే ఆయనను సలహాదారుగా నియమించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అలాగే ఇరిగేషన్ ఇంజినీర్లు సంతాపం ప్రకటించారు.
మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి సంతాపం
రంగారెడ్డి మృతిపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సంతాపాన్ని వ్యక్తం చేశారు. పాలమూరు నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో రంగారెడ్డి కృషి మరవలేనిదని కొనియాడారు.