హైదరాబాద్ , ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): మైనార్టీ గురుకుల సొసైటీలో ప్రైవేట్ వ్యక్తులు రాజ్యమేలుతున్నారు. వారికి ఎలాంటి అర్హతలు లేకున్నా ఉన్నతాధికారులు అందలమెక్కిస్తున్నారు. ఉన్నతాధికారాలను చేజిక్కించుకున్న ఆ ప్రైవేట్ వ్యక్తులు ఇప్పుడు అందినకాడికి దండుకోవడంతోపాటు రెగ్యులర్ ఉద్యోగులను వేధిస్తున్నారు. ఆ వేధింపులను తాళలేక ఇటీవల ఓ గురుకుల ప్రిన్సిపాల్ ఏకంగా ఆత్మహత్యకు సిద్ధపడటం పరిస్థితి తీవ్రతను స్పష్టం చేస్తున్నది. దీనిపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ఆ ప్రైవేట్ వ్యక్తులకు కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలకనాయకుడు అండగా ఉండటమే ఇందుకు కారణమని మైనార్టీ గురుకుల సొసైటీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. సాధారణంగా ప్రభుత్వంలో శాఖలవారీగా విజిలెన్స్ విభాగాలు ఉంటాయి.
కానీ, మైనార్టీ గురుకుల సొసైటీ మాత్రం పూర్తిగా ప్పైవేట్ వ్యక్తులతోనే విజిలెన్స్ విభాగాన్ని ఏర్పాటు చేసింది. అలా రాష్ట్రవ్యాప్తంగా 25-30 మందిని నియమించి, ఒకొకరికి రూ.40 వేల జీతంతోపాటు వాహన సౌకర్యం కల్పించింది. అందుకోసం ఆ సొసైటీ నెలకు దాదాపు రూ.15 లక్షల చొప్పున వెచ్చిస్తున్నది. జిల్లాల పరిధిలోని గురుకులాలను పర్యవేక్షించడం, వాటి ప్రిన్సిపాళ్లపై నిఘా పెట్టడమే ఈ విజిలెన్స్ విభాగం పని. వాస్తవానికి జిల్లా స్థాయిలో కలెక్టర్, అదనపు కలెక్టర్‌తోపాటు, ప్రతి గురుకుల సొసైటీకి సంబంధించిన ఓ ప్రత్యేక అధికారి నిరంతరం గురుకులాలను పర్యవేక్షిస్తుంటారు. కానీ, మైనార్టీ గురుకుల సొసైటీ మాత్రం తమ ప్రిన్సిపాళ్లపై నిఘా పెట్టేందుకే ఒక విజిలెన్స్ విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఆ విభాగానికి సంబంధించినవారు ప్రిన్సిపాళ్లను బెదిరించడంతోపాటు అవినీతికి పాల్పడుతున్నట్టు అనేక ఫిర్యాదులు వచ్చా యి. దీంతో ఆ విభాగాన్ని గతంలోనే రద్దు చేసినప్పటికీ ఇటీవల మళ్లీ పునరుద్ధరించి, ప్రైవేట్ వ్యక్తులకు పెత్తనం కట్టబెట్టారు. వారి బెదిరింపులు, అక్రమాలకు హద్దు లేకుండా పోయిందని సొసైటీలోని ప్రిన్సిపాళ్లు చెప్తున్నారు.
ఆత్మహత్యకు సిద్ధమైన ప్రిన్సిపాల్
మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిని ఓ మైనార్టీ గురుకుల ప్రిన్సిపాల్ డిప్యూటేషన్‌పై హైదరాబాద్‌లోని మరో మైనార్టీ గురుకుల ప్రిన్సిపాల్‌గా కొనసాగుతున్నారు. ఇటీవల ఆ గురుకులాన్ని సందర్శించిన ప్రైవేట్ విజిలెన్స్ బృందం.. డబ్బులు డిమాండ్ చేయడంతో చెల్లించేందుకు సదరు ప్రిన్సిపాల్ అంగీకరించలేదు. దీంతో ఆ ప్రిన్సిపాల్ అక్రమాలకు పాల్పడుతున్నట్టు విజిలెన్స్ బృందం నివేదిక రూపొందించి సొసైటీ కార్యదర్శికి సమర్పించింది. దాని ఆధారంగా ఆ ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేస్తూ సదరు కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆ ప్రిన్సిపాల్ తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు. విజిలెన్స్ ఆఫీసర్ల ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోబోతున్నానంటూ సొసైటీ గ్రూప్‌లో ఏకంగా ఓ వాయిస్ రికార్డును షేర్ చేశారు. డబ్బు కోసం తనను వేధించిన విజిలెన్స్ అధికారుల పేర్లను బాహాటంగానే వెల్లడించారు. దీంతో కంగారుపడిన మైనార్టీ గురుకుల సొసైటీ అధికారులు.. మొబైల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఎట్టకేలకు ఆ ప్రిన్సిపాల్‌ను పట్టుకున్నారు. గతంలో కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఓ మైనార్టీ గురుకుల సొసైటీ విజిలెన్స్ అధికారిపై కూడా అనేక అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. అయినప్పటికీ ఆ అధికారిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
ప్రైవేట్ విజిలెన్స్‌ను ఎత్తివేయాలి: టీజీపీఏ
మైనార్టీ గురుకుల సొసైటీలో ఎలాంటి చట్టబద్ధత లేని విజిలెన్స్ వ్యవస్థను ఏర్పాటు చేశారని తెలంగాణ గురుకుల ప్రిన్సిపాళ్ల అసోసియేషన్ (టీజీపీఏ) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ అజయ్ కుమార్ నిప్పులు చెరిగారు. ఆ విభాగం ఇచ్చే నివేదికల ఆధారంగా ఎంతో మంది ప్రిన్సిపాళ్లను సస్పెండ్ చేయడం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు. గురుకుల వ్యవస్థను బలోపేతం చేసేందుకు అవిశ్రాంతంగా కృషిచేస్తున్న ప్రిన్సిపాళ్ల నైతిక ైస్థెర్యాన్ని దెబ్బతీసే చర్యలను మానుకోవాలని, ప్రైవేట్ విజిలెన్స్ వ్యవస్థను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
తెరవెనుక కాంగ్రెస్ కీలక నేత
మైనార్టీ గురుకుల సొసైటీలో జరుగుతున్న అక్రమాల వెనుక సీఎం రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఓ మైనార్టీ నాయకుడు ఉన్నట్టు తెలుస్తున్నది. గురుకుల సొసైటీ కార్యదర్శితో సంబంధం లేకుండా నేరుగా ఆ నాయకుడే ఆదేశాలు జారీ చేస్తున్నాడని బాధిత ప్రిన్సిపాళ్లు, సొసైటీ ఉద్యోగులు చెప్తున్నారు. కొందరు ఉన్నతాధికారులతో కుమ్మక్కై ఆ నాయకుడు అక్రమాలకు తెరలేపారని, తనకు నచ్చినవారిని ఇష్టారీతిగా సొసైటీలో నియమించి నిధులను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ అక్రమాలపై మైనార్టీ గురుకుల సొసైటీ ఉద్యోగులు, సమాచార హక్కు కార్యకర్తలు ఇప్పటికే అనేకసార్లు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి, ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఆ మైనార్టీ నాయకుడు సీఎంవో స్థాయిలో ఒత్తిడి తెచ్చి అక్రమాలపై విచారణ జరుగకుండా అడ్డకుంటున్నాడని చెప్తునారు.