హైదరాబాద్ సిటీబ్యూరో, మే 13 (నమస్తే తెలంగాణ) : క్యూర్ పరిధిలోని వీధుల్లో వెలుగులు విరజిమ్మేలా లైట్ల ఏర్పాటుకు సంబంధించిన టెండర్‌ను ముఖ్యనేత అనుచరుడికి కట్టబెట్టేందుకు నిబంధనల మార్పు జరిగినట్టు సమాచారం. ఇందుకోసం మూడు కార్పొరేషన్ల (జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి) పరిధిలో ఉన్న సుమారు 7.60 లక్షల స్ట్రీట్ లైట్ల ఏర్పాటులో ఒకే విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ఇందుకు కొత్తగా ఏర్పడిన సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్ల పర్యవేక్షణ బాధ్యతను జీహెచ్ఎంసీకి అప్పగించారు. ఇందుకోసం ముగ్గురు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని చీఫ్ ఇంజినీర్లతో (సీఈ) ఓ ప్రత్యేక కమిటీని వేశారు. ఇందులో భాగంగానే రూ.1,341 కోట్ల భారీ అంచనాతో 10 ఏండ్ల నిర్వహణతో టెండర్లకు సిద్ధమయ్యారు.
ఇండివిడ్యువల్ లుమినార్ కంట్రోల్ (ఐఎల్సీ), లుమినార్ కంట్రోల్ యూని ట్ (ఎల్సీయూ) పద్ధతుల్లో టెండర్లు పిలిచేందుకు కసరత్తు పూర్తి చేశారు. స్ట్రీట్ లైట్ల నిర్వహణలో గతంలో తలెత్తిన లోపాలను అధిగమించేందుకు ఈ సారి సరికొత్త, కఠిన నిబంధనలు రూపొందించామని, ఢిల్లీ మున్సిపాలిటీతో పాటు ఓఆర్ఆర్పై అనుసరిస్తున్న ఆధునిక మెయింటెనెన్స్ విధానాన్ని అమలు చేస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే సినీ రంగంతో అనుభవం ఉన్న సదరు ముఖ్య నేత అనుచరుడు ఎలాగైనా ఈ టెండర్‌ను తన ఖాతాలో వేసుకోవాలని ఇప్పటి నుంచే చక్రం తిప్పుతున్నట్టు ప్రస్తుతం బల్దియాలో చర్చ జరుగుతున్నది. గతంలో కంటే నిర్వహణ ఖర్చును పెంచడంతో పాటు మెటీరియల్ కూడా సదరు ఏజెన్సీ చేతుల్లో పెట్టి పదేండ్ల పాటు వీధి లైట్ల ప్రాజెక్టును కట్టబెట్టేందుకు మార్గం సుగమమైందని సమాచారం. ఇందుకు టెండర్ల నిబంధనలు సైతం సదరు ముఖ్యనేతకు సంబంధించిన ఏజెన్సీకి అనుకూలంగా ఉండేలా రూపొందించినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి.
రాబోయే పదేండ్ల కాలానికి వీధి దీపాల నిర్వహణ, మరమ్మతుల కాంట్రాక్టును ఒక్క ఏజెన్సీకే అప్పగించేలా అధికారులు రంగం సిద్ధం చేశారు. ప్రజల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, నేరాల నియంత్రణలో వీధి దీపాలు కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో అత్యాధునిక సాంకేతికతతో పర్యవేక్షణ, స్మార్ట్ గవర్నెన్స్ లో భాగంగా సరికొత్త టెక్నాలజీని వినియోగించాలని నిర్ణయించారు. ప్రతిపాదనల్లో భాగంగా ఏ ఒక ప్రాంతంలోనూ చీకటి ఉండకుండా, నిరంతరాయంగా దీపాలు వెలిగేలా చూడటం, వీధి దీపాలకు సంబంధించి ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను 48 గంటల వ్యవధిలోనే పరిషరించేలా నిబంధనలు రూపొందించారు. కేవలం ఎల్ఈడీ బల్బులే కాకుండా, సీసీఎంఎస్ ప్యానెళ్లు, పోల్-టు-పోల్ కేబులింగ్, ఎర్తింగ్ సిస్టమ్స్, దెబ్బతిన్న విద్యుత్ స్తంభాల మార్పిడీ వంటివన్నీ ఈ కాంట్రాక్టు పరిధిలోకి వస్తాయి. సెంట్రలైజ్డ్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా ఎకడ దీపాలు వెలుగుతున్నాయి, ఎకడ సాంకేతిక లోపాలు ఉన్నాయో ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇదంతా ఒక ఎత్తయితే సదరు ఈ ప్రాజెక్టు ప్రతిపాదనల్లోనూ మతలబు దాగి ఉందన్న విమర్శలు వస్తున్నాయి.
గతంలో జీహెచ్ఎంసీ మెటీరియల్ ఇస్తే సదరు కాంట్రాక్ట్ ఏజెన్సీ నిర్వహణ చేపట్టేది..కానీ ఈ కొత్త ప్రాజెక్టుకు మాత్రం నిబంధనలు అడ్డగోలుగా సవరించినట్టు తెలుస్తున్నది. మెటీరియల్ ఏజెన్సీకి ఇవ్వడంతో పాటు నిర్వహణ ఖర్చును భారీగా పెంచినట్టు సమాచారం. సాధారణంగా ఇలాంటి భారీ ప్రాజెక్టుల్లో అనుభవం, టర్నోవర్ వంటి కఠిన నిబంధనలు ఉంటాయి. కానీ సదరు ముఖ్యనేత అనుచరుడి ఒత్తిడితో టెండర్ నిబంధనల్లో కీలక మార్పులకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తున్నది. అన్నింటికి మించి అనుభవం లేని సంస్థకు ఈ ప్రాజెక్టును ఇస్తారన్న వాదనలు వినిపిస్తున్నాయి. కాంట్రాక్టు ఎవరికి దకుతుందో టెండర్ రాకముందే ఖరారైపోయినప్పుడు ఇక ఈ ప్రక్రియ అంతా ప్రహసనమేనని బల్దియా వర్గాలు వాపోతున్నాయి. ఈఈఎస్ఎల్ వంటి జాతీయ స్థాయి సంస్థలు నిర్వహించిన పనుల్లోనే సమస్యలు తలెత్తగా, ఇప్పుడు 7.60 లక్షల వీధి దీపాల నిర్వహణను కేవలం ఒక్కరికే మేలు చేసేలా అధికారులు అడుగులు వేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
