హైదరాబాద్, మరికల్ డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో అధికార పార్టీ ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రి తరహాలోనే ఓట్ల లెక్కింపులో పెద్దచింతకుంటలోనూ బీఆర్ఎస్ అభ్యర్థికి అన్యాయం జరిగింది. అధికార పార్టీ ఎమ్మెల్యే చెప్పినట్టుగా అధికారులు విని తనకు అన్యాయం చేశారని బాధితురాలు ఆరోపించారు. ఓట్ల లెక్కింపులో జరిగిన అన్యాయంపై విచారణ జరిపి అధికారులపై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి బాధితురాలు విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు మంగళవారం ఎస్ఈసీ సంయుక్త కార్యదర్శి వినోద్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. తొలి, రెండో విడత ఓట్ల లెక్కింపులో అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారని, విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇప్పటికే పది మంది వరకు బాధితులు ఎస్ఈసీకి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తున్నది.
మంగళవారం ఒక్క రోజే కమిషర్ కార్యాలయంలో ఇద్దరు బాధితులు ఫిర్యాదు చేశారు. ‘నారాయణపేట జిల్లా మరికల్ మండలం పెద్దచింతకుంట గ్రామపంచాయతీకి ఈ నెల 14న పోలింగ్ జరిగింది. బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచిన బ్యాగరి పద్మ(భర్త రాములు)కు ఫుట్‌బాల్ గుర్తు కేటాయించారు. కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి పొర్ల తిరుపతమ్మ( భర్త కురుమన్న)కు బ్యాటు గుర్తు కేటాయించారు. పోలింగ్ సజావుగా ముగిసింది. ఓట్ల లెక్కింపు సమయంలో స్టేజీ-2 అధికారి 65 బ్యాలెట్లను చెల్లని ఓట్లుగా ప్రకటించారు. వాటిని అడిగినా చూపించలేదు. తనకు 605 ఓట్లు వచ్చినట్టు, తిరుపతమ్మకు 604 ఓట్లు వచ్చినట్టు ప్రకటించారు. స్టేజీ-2 అధికారి ఎవరితోనో ఫోన్లో మాట్లాడి వచ్చి తిరుపతమ్మకు 605 ఓట్లు, తనకు 604 ఓట్లు వచ్చినట్టు చెప్పారు. రీకౌంటింగ్ చేయాలని కోరినా పట్టించుకోకుండా తిరుపతమ్మ గెలిచినట్టుగా ప్రకటించారు. రాతపూర్వకంగా అభ్యర్థించినా లేఖను తీసుకోలేదు. రాత్రి 3 గంటలవరకు ధర్నా చేసినా స్పందించకుండా వెళ్లిపోయారు. ఓట్ల లెక్కింపుపై విచారణ జరుపాలని ఎంపీడీవోతోపాటు కలెక్టర్, ఎస్ఈసీకి ఫిర్యాదు చేశాము’ అని బాధితురాలు పద్మ పేర్కొన్నారు.
6 సార్లు లెక్కించి ఫలితం మార్చారు: నాగమణి
‘ఖమ్మం జిల్లా మధిర మండలం వంగవీడు(ఎస్సీ జనరల్) గ్రామ పంచాయతీకి ఈ నెల 11న పోలింగ్ జరిగింది. బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా తాను(దొండపాటి నాగమణి భర్త జానయ్య)బరిలో నిలిచాను. ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రత్యక్షంగా చూశాను. మొదటి దశ కౌంటింగ్ పారదర్శకంగా జరిగింది. కౌంటింగ్ అనంతరం తాను (ఉంగరం గుర్తు) 3 ఓట్ల మెజారిటీతో గెలుపొందాను. కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి సిద్దిపోగు ప్రసాద్ తండ్రి జీవరత్నం అభ్యర్థన మేరకు 2వసారి కౌంటింగ్‌కు రిటర్నింగ్ అధికారి అనుమతిచ్చారు. అప్పుడు కూడా తానే 3 ఓట్లతో గెలుపొందినట్టు తేలింది. ఆర్వో తన విజయాన్ని ప్రకటించకుండా వేరే గదిలోకి వెళ్లి ఫోన్ మాట్లాడి వచ్చి బ్యాలెట్ పేపర్లన్నింటినీ మళ్లీ లెకపెట్టమని ఆదేశించారు. ఆరుసార్లు లెకించినా తానే 3 ఓట్ల ఆధిక్యంలో ఉన్నాను. రాత్రి 10 గంటలకు చివరగా ప్రసాద్ 4 ఓట్లతో గెలిచినట్టు ప్రకటించారు’ అని బాధితురాలు నాగమణి వాపోయారు. మంగళవారం ఎస్ఈసీకి ఫిర్యాదు చేశారు.