పెద్దపల్లి, మే 28(నమస్తే తెలంగాణ) : సింగరేణి రామగుండం ఆర్జీ-3 ఓపెన్‌కాస్ట్ మైన్స్ నుంచి తీసి ఓబీ కుప్పలుగా పోసిన మట్టి.. అనుమతుల మాటున అక్రమ దారి పడుతున్నదనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. పెద్దపల్లి జిల్లా రామగుండం డివిజన్-3 పరిధిలోని ఓసీపీ-2 పరిధిలోని బేగంపేట ఓబీ కుప్పల్లోని మట్టికి నిబంధనలకు విరుద్ధంగా నేషనల్ గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణ సంస్థ మేఘాకు అనుమతులివ్వడంపై సర్వత్రా చర్చ జరుగుతున్నది. మంథనికి చెందిన పుట్ట ముకేష్ హైకోర్టును ఆశ్రయించడంతో విచారించిన కోర్టు నాలుగు వారాల్లో జవాబివ్వాలని అధికారులను ఆదేశించడం సంచలనం రేపింది. మంథని మండలం అడ్యాల, నాగారం పరిధిలోని ఓపెన్ కాస్ట్ మైన్స్ నుంచి సింగరేణి కాలరీస్ కంపనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్) 40 లక్షల క్యూబిక్ మీటర్ల రూ. 22కోట్ల విలువగల మట్టిని అక్రమంగా తరలిస్తున్నారని కోర్టుకు విన్నవించారు.
దీంతో పిటిషనర్‌తోపాటు గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణ సంస్థ మెగా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్), ఇతర సంబంధిత పక్షాలకు నోటీసులు జారీచేసి, వారి వాదనలు వినిపించే అవకాశం ఇచ్చిన అనంతరం విచారణ చేపట్టి నాలుగు వారాల్లో చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కోర్టు ఆదేశాలతో హైవే రోడ్డు నిర్మాణానికి ఇచ్చిన అనుమతులపై అనుమానాలు పెరిగాయి. సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర మైనింగ్ శాఖలు నేషనల్ హైవే నిర్మాణ సంస్థకు ఇచ్చిన అనుమతుల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. మైనింగ్ పూర్తైన తర్వాత తిరిగి వాటిని పూడ్చడానికి ఓబీ మట్టిని అక్కడే ఉంచాలనే నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని లెక్క చేయకుండా అనుమతులు ఇవ్వడంపై కార్మిక లోకం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఇటీవల ఓపెన్‌కాస్ట్‌లను మూసివేసే సమయంలో వాటిని పెద్దపెద్ద చెరువులుగా మార్చాలనే నిబంధనలను అమల్లోకి తీసుకువచ్చి అక్రమాలకు తెరతీశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గనుల చట్టం-1952, ఖనిజ రాయితీ నియమాలు, పర్యావరణ పరిరక్షణ చ ట్టంలోని నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంచిర్యాల జిల్లా నుంచి రాష్ట్రంలో ని అన్ని జిల్లాలను కలుపుతూ నిర్మిస్తున్న నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి సింగరేణి ఓబీ మట్టి వాడటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సింగరేణి, మైనింగ్ అధికారులు నిర్మాణ సంస్థతో కు మ్మక్కై ఓబీ మట్టికి అనుమతులివ్వడాన్ని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఓబీ మట్టికి అనుమతుల పేరిట ఒక వైపు నేషనల్ హైవే నిర్మాణానికి మేఘా సంస్థ 37,500 మెట్రిక్ టన్నుల మట్టి కోసం రూ. 9,77,158 చెల్లించి అత్యధికంగా మట్టిని లూటీ చే స్తుండగా.. స్థానిక అధికార పార్టీ నాయకులు సైతం ప్రైవేట్‌గా మట్టిని అమ్ముకోవడంతో పాటు తమ వెంచర్లు, ఇతర నిర్మాణాలకు వందలాది లారీల్లో మట్టిని తరలిస్తున్నప్పటికీ అధికారులు మామూళ్ల మ త్తులో జోగుతున్నారనే అరోపణలు ఉన్నాయి. సింగరేణి యాజమాన్యం, మైనింగ్ శాఖ కార్మికుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని అరకొర అనుమతులతో పెద్ద ఎత్తున లూటీ చేస్తున్న ఓబీ మట్టిని ఆపాలని ప్రజలు కోరుతున్నారు.