హైదరాబాద్, డిసెంబర్ 1(నమస్తే తెలంగాణ) : కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో పీజీ వైద్య విద్య పరీక్షల్లో నిబంధనలకు విరుద్ధంగా జవాబు పత్రాలను దిద్ది, ఓ విద్యార్థిని పాస్ చేసిన విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ పరిణామాలతో వైస్ చాన్స్‌లర్ నందకుమార్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. తాజాగా పరీక్షల ఫలితాల్లో అక్రమాలు జరిగాయని పీజీ వైద్య విద్యార్థులు వెంకటేశ్ కుమార్, అజయ్ ప్రకాశ్, ముకుర్రమ్, శ్రీనివాస్ సోమవారం ప్రకటన విడుదల చేశారు. అక్టోబర్ 30న పరీక్షలు పూర్తయితే ఐదు రోజుల్లోనే ఫలితాలెలా ఇచ్చారని అనుమానాలు వ్యక్తంచేశారు. గతంలో ఫలితాలకు 20రోజులు పట్టేదని, హడావుడిగా వెల్లడించడంతోనే తమకు అన్యాయం జరిగిందని ఆరోపించా రు. గతంలో 1-2% మాత్రమే ఫెయిల్ అయ్యే పరిస్థితి ఉండేదని, ఈసారి ఏకం గా 11%మంది ఫెయిల్ కావడం అనుమానాలకు తావిస్తున్నదని పేర్కొన్నారు.
అన్ని ప్రశ్నలకు జవాబులు రాశామని చాలా మంది విద్యార్థులు చెబుతున్నారని, అలాంటప్పుడు కేవలం వారికి 40 మార్కులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం.. జవాబు పత్రాలు దిద్దాలంటే కనీసం ఎనిమిదేండ్ల అనుభవం ఉండాలని, అవగాహన లేని వారితో దిద్దించడంతోనే తాము ఫెయిల్ అయ్యామని వాపోయారు. ముగ్గురు ప్రొఫెసర్లు పేపర్లు దిద్దాల్సి ఉండగా.. కేవలం ఒకే ప్రొఫెసర్ తమ పేపర్ దిద్ది ఉంటారని అనుమానాలు వ్యక్తంచేశారు. ఈసారి వాల్యుయేషన్ సాఫ్ట్వేర్ మార్చారని, దానిపైన తమకు అనుమానాలు ఉన్నాయని వివరించారు. న్యాయం చేయాలని వీసీ, హెల్త్ సెక్రటరీ, ఆరోగ్యశాఖ మంత్రిని కలిసినా స్పందించడం లేదని వాపోయారు. ప్రభుత్వం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. త్వరలో సీఎం రేవంత్‌రెడ్డిని కలుస్తామని విద్యార్థులు తెలిపారు.