మహబూబ్‌నగర్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో చేపడుతున్న హకీంపేట పారిశ్రామిక కారిడార్‌లో అక్రమాలకు పాల్పడిన ఓ నకిలీ బ్రోకర్‌తో జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్, కాడ ఆఫీసర్, ఇతర ఉన్నతాధికారులు చెట్టాపట్టాలేసుకొని తిరుగడం చర్చనీయాంశంగా మారింది. వారం రోజుల్లో వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్‌మిశ్రా, సబ్ కలెక్టర్ ఉమాశంకర్, కాడ అధికారి వెంకట్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు కలిసి రెండుసార్లు పారిశ్రామిక కారిడార్‌లో పర్యటించారు. పర్యటించినప్పుడల్లా పరిహారం కుంభకోణానికి సూత్రధారి అయిన షాడో సోదరుడిని చేరదీయడం అనుమానాలకు తావిస్తున్నది. మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కులో జరిగిన అక్రమాలపై ‘నమస్తే తెలంగాణ’ ప్రచురించిన వరుస కథనాలు ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. ఈ విషయంలో ముఖ్యమంత్రి కార్యాలయం సీరియస్‌గా ఉంది.
మరోవైపు, అక్రమాలకు సహకరించిన ఓ అధికారి కూడా కలెక్టర్ వెంట ఉండటంతో చేసిన తప్పులను కప్పి పుచ్చుకొనే పనిలోపడినట్టు ప్రచారం జరుగుతున్నది. దుద్యాల తహసీల్దార్, తాండూరు ఆర్డీవోలు కలిసి మొత్తం హకీంపేటకు సంబంధించిన రికార్డులన్నింటినీ వికారాబాద్ కలెక్టరేట్లో అప్పగించినట్టు సమాచారం. ఇదిలాఉండగా, కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి షాడోపై ఫిర్యాదులు వెళ్తున్నాయి. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ప్రస్తుతం షాడో అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు ప్రచారం జరుగుతున్నది. ‘నమస్తే తెలంగాణ’ కథనాలపై రగిలిపోతున్న షాడో గ్రామంలోని కొందరిని రెచ్చగొట్టి, సమాచారం ఇచ్చారనే నెపంతో కొంతమంది బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేస్తున్నట్టు తెలుస్తున్నది.
హకీంపేటలో ఏర్పాటుచేస్తున్న మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ కారిడార్‌లో భూములు కోల్పోతున్న రైతుల పరిహారాన్ని అందినకాడికి దోచుకొనేందుకు వేసిన బిగ్ స్కెచ్ బయటపడటంతో మల్లగుల్లాలు పడుతున్నారు. సర్వే నంబర్ 252లో ఉన్న ప్రభుత్వ భూమి లో ఆర్ఐ, తహసీల్దార్, ఆర్డీవోల సంతకాలను ఫోర్జరీ చేసి నకిలీ పాసుపుస్తకాలను పుట్టించి.. అసలు విస్తీర్ణాన్ని పెంచి ఏకంగా ఆన్‌లైన్‌లోకి ఎక్కించారు. ఇదే గ్రామానికి చెందిన షాడో సోదరుడే కీలకపాత్ర వహించడం, ఐదువేలకు, పదివేలకు పాసుపుస్తకాలు పుట్టించి ఏకంగా 422 మంది రైతులను సృష్టించినట్టు తెలుస్తున్నది. ఏకంగా 1954-55 కాస్ట్రా పహానీతోతోపాటు ఆర్వోఆర్ను కూడా ట్యాంపరింగ్ చేసినట్టు వినికిడి.
వికారాబాద్ జిల్లా కేంద్రంలోని భూ సేకరణ అధికారి పాత్రపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. షాడోని అడ్డంపెట్టుకొని ఈ అధికారి కోట్లు వెనకేసుకొన్నట్టు ప్రచారం జరుగుతున్నది. సర్వే నంబర్ 252లో అసలైన రైతులకు పరిహారం ఎగ్గొట్టి నకిలీ రైతులకు పరిహారం ముట్టజెప్పడంలో ఈ అధికారి పాత్ర ఉన్నదనేది బహిరంగ రహస్యమే. అంతటితో ఆగకుండా షాడోకు అనుకూలంగా నోటిఫికేషన్లు జారీ చేసి రైతుల విస్తీర్ణాన్ని బహిర్గతం చేయకుండా పక్కా ప్లాన్ రచించినట్టు తెలుస్తున్నది. వికారాబాద్ జిల్లా ఉన్నతాధికారిపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పరిహారం అడుగడానికి వెళ్లిన రైతులపై బెదిరింపులకు దిగడం, రూ.9 లక్షలు కూడా పలుకని భూములకు రూ.20 లక్షలు ఇస్తుంటే తమాషా చేస్తున్నారా? అంటూ దబాయించడం లాంటివి ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అక్రమాలకు సహకరించిన వికారాబాద్ జిల్లా యంత్రాంగం మొత్తం ఇక్కడే తిష్ట వేస్తే ఇక రైతులకు ఏం న్యాయం జరుగుతుందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సీఎంవో కార్యాలయం నుంచి ఇద్దరు అధికారుల బృందం ఈ అక్రమాలపై లోలోపల విచారణ జరుతున్నదని, పోలీస్ అధికారుల పాత్రపై కూడా ఆరా తీస్తున్నారని సమాచారం. హకీంపేట భూముల కుంభకోణంలో పాత్రధారి అయిన షాడోను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ కాంగ్రెస్ నాయకులు తీర్మానాలు చేసి అధిష్ఠానానికి పంపిస్తున్నట్టు పేరు చెప్పడానికి ఇష్టపడని కాంగ్రెస్ నేత ఒకరు ‘నమస్తే తెలంగాణ’కు వెల్లడించారు.
2024 నవంబర్ 11న జరిగిన లగచర్ల ఘటనను అడ్డంపెట్టుకొని ఉన్నతాధికారులంతా ఏకమై నిజమైన రైతులకు పరిహారం అందించకుండా బోగస్ రైతులను సృష్టించి పరిహారం కొట్టేసే ముఠాకు సహకరించారు. ముఖ్యమంత్రిని అడ్డం పెట్టుకొని ఓ షాడో రంగంలోకి దిగి అంతా తానే అయి వ్యవహరించారు. గతంలో తన సోదరుడు చేసిన నకిలీ పాసుపుస్తకాలను ఇప్పుడు ఉపయోగించుకొని పెద్దఎత్తున పరిహారాన్ని దోచుకున్నారు. కమీషన్లు కొట్టేయడమే కాకుండా నిర్వాసితుల కాలనీలో ప్లాట్లను కూడా గుంజుకొని.. నిజమైన రైతులను అధికారుల చుట్టూ తిప్పించారు. విసిగి వేసారిన రైతులు కారిడార్‌లో జరిగిన అక్రమాలను బయటపెట్టారు.