త్వరలో అక్కడి ప్రతినిధి బృందం రాక
ఇరాన్ విదేశాంగ మంత్రి వెల్లడి
హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): భారత్‌తో ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంతోపాటు తెలంగాణలో వాణిజ్య, పెట్టుబడి అవకాశాలను పరిశీలిస్తున్నట్టు ఇరాన్ విదేశాంగ మంత్రి డాక్టర్ అమీర్-అబ్ద్దుల్లాహియాన్ పేర్కొన్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫార్మా, ఆహార శుద్ధి, వ్యవసాయం తదితర రంగాల్లో తెలంగాణలో ఉన్న నైపుణ్యాన్ని ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్టు వెల్లడించారు. తయారీ, ఇంధనం, పెట్రోలియం రంగాల్లో తెలంగాణ పారిశ్రామికవేత్తలకు ఇరాన్ తగిన అవకాశం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నదన్నారు. తెలంగాణ వాణిజ్య, పారిశ్రామిక మండళ్ల సమాఖ్య (ఎఫ్‌టీసీసీఐ) సభ్యులు ఆదివారం ఫెడరేషన్ భవన్లో ఇరాన్ మంత్రితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అబ్ద్దుల్లాహియాన్ మాట్లాడుతూ, దక్షిణ భారతదేశంలోని పారిశ్రామికవేత్తలు ఇరాన్‌ను సందర్శించి అక్కడి అవకాశాలను తెలుసుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు, త్వరలో తమ దేశ ఆర్థిక వ్యవహారాల ప్రతినిధి బృందం కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించి పెట్టుబడి అవకాశాలను పరిశీలిస్తుందని పేర్కొన్నారు.
ఇరానియన్లకు హైదరాబాద్‌తో ప్రత్యేక సంబంధాలున్నాయని, ఇరాన్‌తో పోలిస్తే ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు ఒకే విధంగా ఉంటాయని పేర్కొంటూ, ఆర్థిక, వాణిజ్యపరంగా కూడా సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్ మాట్లాడుతూ, తెలంగాణ దేశంలోనే పెట్టుబడుల గమ్యస్థానంగా మారిందని, రాష్ట్రం ఏర్పడినప్పటినుంచి ఇప్పటివరకు 18దేశాల పెట్టుబడులు రాష్ర్టానికి వచ్చినట్లు చెప్పారు. ఇక్కడ పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉండటమే కాకుండా, ప్రభుత్వ పారిశ్రామిక అనుకూల, స్నేహపూర్వక విధానాలు పెట్టుబడులను మరింతగా ఆకర్షిస్తున్నట్టు తెలిపారు. పెట్టుబడిదారులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా ప్రభుత్వం తరపున అన్నిరకాల సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలోని వివిధ కార్పొరేట్, పరిశ్రమల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు.