హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలో సర్వే నం.194లో తాము పట్టా భూములనే కొనుగోలు చేశామని పలువురు ఐపీఎస్ అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. తాము కొనుగోలు చేసినవి భూదాన్ భూములు కావని పేర్కొన్నారు. అవి భూదాన్ భూములేనంటూ దాఖలైన పిటిషన్‌పై సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ వారు అప్పీళ్లను దాఖలు చేశారు. తమ భూములను కూడా నిషేధిత జాబితాలో చేర్చాలన్న సింగిల్ జడ్జి ఆదేశాలను రద్దు చేయాలని వారు హైకోర్టును కోరారు. సర్వే నంబర్ 194లో 16, 20, 18 గుంటల చొప్పున కొనుగోలు చేశామని, దీనికి సంబంధించిన ఒప్పంద పత్రాలు, విక్రయ పత్రాలు కూడా తమ వద్ద ఉన్నాయని తెలిపారు.
నాగారం గ్రామంలోని భూదాన్ భూముల్లో అక్రమాలపై సీబీఐ, ఈడీతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ మహేశ్వరం మండలానికి చెందిన బిర్ల మల్లేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై రెండు రోజుల క్రితం విచారణ జరిపిన జస్టిస్ సీవీ భాసర్‌రెడ్డి నాగారం గ్రామంలో సర్వే నం 181, 182, 194, 195లో భూదాన్ భూములకు సంబంధించి జరిగిన అక్రమ విక్రయాల్లో పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్, ఇతర ఉన్నతాధికారుల పాత్ర ఉన్నదని ప్రాథమిక నిర్ధారణకు వచ్చి ఈ భూములను నిషేధిత జాబితాలో చేర్చాలని మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు.
ఈ ఆదేశాలను రద్దు చేయాలంటూ ఐపీఎస్ అధికారులు రవిగుప్తా, తరుణ్‌జోషి, బీకే రాహుల్ హెగ్డే, జితేందర్‌కుమార్ గోయల్ భార్య రేణుగోయల్, ఐఏఎస్ అధికారి జనార్దన్‌రెడ్డి కొడుకు రాహుల్ బుసిరెడ్డి, ఐపీఎస్ అధికారులు మహేశ్ మురళీధర్ భగవత్, సౌమ్యామిశ్రా, స్వాతిలక్రా, ఉమేశ్ షరాఫ్ భార్య రేఖ షరాఫ్, ప్రైవేటు వ్యక్తి వీరన్నగారి గౌతంరెడ్డి వేర్వేరుగా నాలుగు అప్పీళ్లను దాఖలు చేశారు. ఈ అప్పీల్ పిటిషన్లపై హైకోర్టు తాతాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టనుంది.