హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ) : ప్రొఫెషనల్ కాలేజీల్లో ఫీజుల నిర్ధారణకు సర్కారు విడుదల చేసిన మార్గదర్శకాలు ఉత్తుత్తి కొలమానాలను తలపిస్తున్నాయి. ఫీజులపై పు నర్విచారణ తూతూమంత్రంగా సాగుతున్నది. ఇంజినీరింగ్ కాలేజీల ఫీజులపై తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ(టీఏఎఫ్ఆర్సీ) పునర్విచారణ సోమవారం నుంచి ప్రారంభమయ్యింది. 20 కాలేజీలను పిలువగా, 17 కాలేజీలను టీఏఎఫ్ఆర్సీ అధికారులు విచారించారు. మరో మూడు కాలేజీలు గైర్హాజరయ్యాయి. ఫీజులపై ఎలాంటి విచారణ జరగలేదని కాలేజీల యాజమాన్యాలు తెలిపాయి.
టీఏఎఫ్ఆర్సీ అధికారులు ఆడిటింగ్ నివేదికలు అసలైనవేనని అఫిడవిట్లు తీసుకుని పంపించేశారు. మంగళవారం మరో 20 కాలేజీలను టీఏఎఫ్ఆర్సీ విచారించనున్నది. ఈ ప్రక్రియ పై కాలేజీల యాజమాన్యాలు స్పందిస్తూ అంతా అయోమయంగా ఉన్నదని పేర్కొన్నాయి. ప్రొఫెషనల్ కాలేజీల్లో ఫీజుల నిర్ధారణకు ప్రభు త్వం జారీచేసిన కొలమానాలు పక్కకేనా అన్న అనుమానాలు తెలెత్తుతున్నాయి. ఈ కొలమానాలు ఇప్పుడు వర్తించవని, వచ్చే బ్లాక్ పీరియడ్‌కు వర్తిస్తాయని ఓ కీలక అధికారి వ్యా ఖ్యానించారు.