Rythu Bharosa | హైదరాబాద్, జనవరి 27(నమస్తే తెలంగాణ): రైతు భరోసా పథకం కింద రైతులకు అందజేసే పంట పెట్టుబడి సాయం పంపిణీ మరింత ఆలస్యమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిరుపయోగమైన భూములు, రైతుల వివరాల సేకరణలో గందరగోళమే ఇందుకు కారణమనే అభిప్రాయం వ్యవసాయశాఖ వర్గాల్లో వ్యక్తమవుతున్నది. ప్రభు త్వం చేసిన ప్రకటన ప్రకారం ఈ నెల 26 నుంచి రాష్ట్రంలోని రైతులందరికీ రైతుభరోసా పంపిణీ ప్రారంభం కావాల్సి ఉన్నది. కానీ, రైతుభరోసాపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రుల మాటలు ఉత్తవేనని తేలిపోయింది. సోమవారం కేవలం మండలానికి ఒక్క గ్రామంలో మాత్రమే రైతుభరోసా పంపిణీ చేసింది. ఈ గ్రామాల్లోనూ రైతులందరికీ కాకుండా కొంతమందికి మాత్రమే ఇచ్చి, మిగిలినవారికి మొండిచెయ్యి చూపినట్టు తెలిసింది.
రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన గ్రామాల రైతులకు రైతుభరోసా ఎప్పుడు వస్తుందనే అంశంపై స్పష్టత కరువైంది. దీనిపై ప్రభుత్వం కూడా ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. రైతుభరోసా పంపిణీకి భూముల సర్వే అడ్డంకిగా మారినట్టు తెలిసింది. సాగుచేయని భూములపై సర్వే ముగియకపోవడం, ఆ వివరాలను ఎంట్రీ చేయడంలో ఆలస్యం కారణంగా రైతుభరోసా ఇవ్వలేకపోతున్నట్టు వ్యవసాయ శాఖ వర్గాలు చెప్తున్నాయి. ఈ ప్రక్రియను పూర్తిచేసి, గ్రామాలవారీగా ఆయా భూములను ఫ్రీజ్(లాక్) చేసిన తర్వాతే రైతుభరోసా పంపిణీ ప్రారంభమవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. గతంలో పనికిరాని భూములకు రైతుబంధు సాయం అందించారని, తాము ఆ భూములను రైతుభరోసా నుంచి తొలగిస్తామంటూ కాంగ్రెస్ సర్కారు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇందులో భాగంగానే ఏఈవోలు, రెవెన్యూ శాఖ అధికారులు కలిసి వారం రోజులుగా సర్వే నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు ఆ సర్వే పూర్తికాలేదని తెలిసింది. ఇంకా కొన్ని పట్టణ ప్రాంతాల్లో సర్వే నిర్వహిస్తున్నట్టు సమాచారం. ఇప్పటివరకు లెక్కతేలిన నిరూపయోగ భూమి 2 లక్షల ఎకరాలని, 3 లక్షల ఎకరాలని, 10 లక్షల ఎకరాలని అంటూ ప్రభుత్వం లీకులిస్తున్నది. అధికార లెక్క మాత్రం వెల్లడించలేదు. సర్వేలో గుర్తించిన పనికిరాని భూములను వెబ్సైట్లో ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ డాటాను క్షేత్రస్థాయిలో ఎమ్మార్వో, వ్యవసాయ అధికారి ధ్రువీకరించి ప్రభుత్వానికి పంపించాలి. దానిని ఉన్నతాధికారులు ఆమోదించాలి. ఆ తర్వాత ఆయా భూములను గ్రామాలవారీగా ఫ్రీజ్ చేయాలి. రైతుభరోసాకు అనుకూల, వ్యతిరేకత భూముల వివరాలను రెవెన్యూ శాఖ నుంచి వ్యవసాయ శాఖకు పంపించాలి. అప్పుడు వ్యవసాయ శాఖ ఆర్థికశాఖతో సమన్వయం చేసుకొని రైతుభరోసా డబ్బులు విడుదలచేయాలి.
రైతుల ఆశలు ఆవిరి
కాంగ్రెస్ సర్కారు వానకాలం రైతుభరోసాను ఎగ్గొట్టింది. ఈ యాసంగికైనా రైతుభరోసా వస్తుందో రాదో అనే ఆందోళన రైతుల్లో నెలకొన్నది. ఈ నెల 26న రైతుభరోసా ఇస్తామంటూ ప్రభుత్వం ప్రకటించడంతో రైతులు ఆశగా ఎదురుచూశారు. చివరకు నిరాశే మిగిలింది. బీఆర్ఎస్ హయాంలో మాదిరిగా తొలిరోజు ఎకరం రైతులకు రైతుభరోసా జమ చేసి ఉంటే, 22.55 లక్షల మంది రైతులకు రైతుభరోసా జమ అయ్యేది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం 4.41 లక్షల మందికి మాత్రమే రైతుభరోసా జమ చేసింది. మిగిలిన 18.14 లక్షల మంది రైతులకు తొలిరోజు రైతుభరోసా జమ కాలేదు. దీంతో 26న రైతుభరోసా నిధులు వస్తాయని ఎదురుచూసిన ఎకరంలోపు రైతులకు నిరాశే ఎదురైంది.
రెండు నెలలు ఆగాల్సిందేనా?
ఆదివారం 2 పథకాల ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పథకాలను మార్చి 31 వరకు పూర్తిచేస్తామని ప్రకటించారు. సీఎం వ్యాఖ్యల వెనుక భారీ ప్లాన్ ఉన్నదని, 4 పథకాలను ఇప్పట్లో అమలుచేయడం కష్టమేననే విషయాన్ని పరోక్షంగా చెప్పారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. రైతుభరోసాను కూడా రైతులందరికీ పంపిణీ చేయడానికి మార్చి 31 వరకు సమయం తీసుకుంటారనే చర్చ జరుగుతున్నది. దీంతో రైతులు రైతుభరోసా కోసం మరో రెండు నెలలు ఎదురుచూడక తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.