హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నూతన మార్గదర్శకాల మేరకు కృష్ణా జలాల పంపిణీకి సంబంధించిన విచారణ కొనసాగాల్సిందేనని బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఎదుట తెలంగాణ ప్రభుత్వం బలంగా వాదనలు వినిపించింది. ఏపీ అభ్యంతరాలను తీవ్రంగా ఆక్షేపించింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 సెక్షన్ 89 మార్గదర్శకాల ప్రకారం కాకుండా అంతర్రాష్ట్ర జలవివాదాల చట్టం-1956 సెక్షన్ 3 ప్రకారం కృష్ణా జలాలను తెలంగాణ, ఏపీ మధ్య న్యాయమైన వాటాలను పంచాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం గతంలోనే కేంద్రాన్ని కోరింది. తెలంగాణ విజ్ఞప్తి మేరకు కృష్ణా జలాల వివాదాల ట్రిబ్యునల్ 2(కేడబ్ల్యూడీటీ)కు కేంద్రం నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ నేపథ్యంలో ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ నేతృత్వంలో ఢిల్లీలో బుధవారం విచారణ కొనసాగింది. కేంద్రం నూతనంగా జారీ చేసిన మార్గదర్శకాలపై అభ్యంతరాలను తెలుపుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని, ఈ నేపథ్యంలో ట్రిబ్యునల్ విచారణను వాయిదా వేయాలని ఏపీ వాదించింది. దీనిపై తెలంగాణ తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేసింది. కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా దక్కక ఇప్పటికే తెలంగాణ తీవ్రంగా నష్టపోయిందని, విచారణను త్వరితగతిన పూర్తి చేయాలని కోరింది. ఇరు రాష్ర్టాల వాదనలు విన్న తరువాత ఏపీ వాదనలను ట్రిబ్యునల్ చైర్మన్ బ్రిజేశ్‌కుమార్ తోసిపుచ్చారు. ఏపీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఎలాంటి స్టే విధించలేదని, ఈ నేపథ్యంలో ట్రిబ్యునల్ విచారణ నూతన మార్గదర్శకాల మేరకు కొనసాగుతుందని స్పష్టం చేశారు. విచారణకు సంబంధించిన అంశాలను ఆరు వారాల్లోగా నివేదించాలని ఇరు రాష్ర్టాలను ఆదేశించారు. విచారణను జనవరి 22 నుంచి 24వ తేదీలకు వాయిదా వేశారు.