మల్లాపూర్, మే 25: ధాన్యం కొనుగోలు కేంద్రంలో కటింగ్ లేకుండా రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని సెర్ప్ అధికారులు తెలిపారు. ఇష్టారాజ్యంగా ధాన్యం కటింగ్ శీర్షికతో ‘నమస్తే తెలంగాణ’లో శనివారం ప్రచురితమైన కథనానికి ఐకేపీ సెర్ప్ ఉన్నతాధికారులు స్పందించారు. వారి ఆదేశాల మేరకు ఐకేపీ సెర్ప్ ఏపీఎం దేవరాజ్ సంబంధిత క్లస్టర్ సీసీ రాజు, కొనుగోలు కేంద్రం నిర్వాహకులతో కలిసి మల్లాపూర్ మండలంలోని రాఘవపేట కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. కేంద్రం నుంచి ఇప్పటికి 44 లారీల ధాన్యాన్ని రైస్‌మిల్లులకు తరలించినట్టు తెలిపారు. ఇందులో 32 లారీలకు సంబంధించిన లారీ ట్రక్ షీట్లను తీసుకువచ్చి రైతులకు డబ్బుల చెల్లింపు కోసం ఆన్లైన్ డాటా ఎంట్రీ ప్రక్రియను పూర్తి చేసినట్టు పేర్కొన్నారు. మిగతా ట్రక్ షీట్లను రెండు రోజుల్లో తెప్పించి పూర్తి స్థాయిలో రైతులకు ఎలాంటి కటింగ్ లేకుండా డబ్బులు అందేలా చర్యలు తీసుకుంటామని ఏపీఎం హామీ ఇచ్చారు. కొనుగోలు కేంద్రం ఇన్చార్జి, బుక్ కీపర్ పర్యవేక్షణ లోపం వల్లనే ఈ జాప్యం జరిగిందని, ఈ నివేదికను ఉన్నత అధికారులకు సమర్పించనున్నట్టు వారు వెల్లడించారు.