సుబేదారి, అక్టోబర్ 15 : వరంగల్ కమిషనరేట్ పరిధిలోని ఎస్సై, ఇన్స్పెక్టర్ ఓ యువకుడిని గంజాయి కేసులో ఇరికించడమేగాక లక్ష రూపాయలు లంచం తీసుకొని చితకబాదిన ఘటన పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ‘నరకం చూపిస్తున్న ఖాకీ’ శీర్షికన బుధవారం ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనం ఆ స్టేషన్ ఎస్సై, ఇన్స్పెక్టర్కు వణుకు పుట్టించింది. వరంగల్ ఈస్ట్ జోన్ పరిధిలో స్టేషన్లో పనిచేసే ఓ ఎస్సై ఐనవోలుకు చెందిన యువకుడిని డ్రంక్ అండ్ డ్రైవ్ పేరిట చిత్రహింసలు పెట్టి, రూ.లక్ష లంచం తీసుకొని, గంజాయి కేసులో ఇరికించాడు. చేసిన తప్పులు బయటకు రాకుండా బాధితుడితో రాజీ కోసం మధ్యవర్తికి ఫోన్లు చేసి ప్రాధేయపడినట్టు తెలిసింది. మరోవైపు ‘నమస్తే’లో కథనంపై పోలీసులు స్పందించి విచారణకు ఆదేశించారు. దీంతో సిబ్బంది బాధితుడి ఇంటికి వెళ్లి వివరాలు సేకరించారు. ప్రస్తుతం ఎస్సై చితక బాదడంతో కాలు కమిలిపోయిందంటూ బాధితుడు కత్తుల రాజు బుధవారం ఎంజీఎంకు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నాడు.