కంది, ఫిబ్రవరి 20 : ఫార్మా కంపెనీల్లో పల్లాడియం కార్బన్ దొంగతనానికి పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను సంగారెడ్డి జిల్లా, సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. గురువారం సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ చెన్నూరి రూపేశ్ వివరాలు వెల్లడించారు. ఈ నెల 8న యావాపూర్ ఆరీన్ లైఫ్ సైన్సెస్ యూనిట్-3 కంపెనీలో జరిగిన పల్లాడియం కార్బన్ దొంగతనంపై హెచ్ఆర్ మేనేజర్ సూరప్పనాయుడు ఫిర్యాదు మేరకు సదాశివపేటలో కేసు నమోదు చేశారు. ఈ నెల 19న మద్దికుంట చౌరస్తాలో ఆరుగురు నేరస్తులను పట్టుకొని, 96 కిలోల పల్లాడియం కార్బన్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు అల్లం సాంబశివుడు ముఠా 2023లో బొంతపల్లి న్యూ లాండ్ కంపెనీలో 35 కిలోలు, 2024 నవంబర్లో బొల్లారంలోని రాంప్యాక్స్ కంపెనీలో 8 కిలోలు, కర్ణాటకలోని బీదర్ సాయి లైఫ్ సైన్సెస్లో 17 కిలోల పల్లాడియం కార్బన్ దొంగతనం చేశారు. 20 రోజుల క్రితం సాంబశివుడు ఆరీన్ లైఫ్ సైన్సెస్ యూనిట్-3 గురించి తెలుసుకొని స్టోర్ మేనేజర్ ముక్కంటి రెడ్డికి డబ్బు ఆశ చూపి, ఈ నెల 8న 120 కిలోల పల్లాడియం కార్బన్ దొంగలించాడు. దీని విలువ 4.50 కోట్లు ఉంటుదని ఎస్పీ వెల్లడించారు.