శేరిలింగంపల్లి, డిసెంబర్ 24: పసిపిల్లలను విక్రయిస్తున్న 11 మంది సభ్యుల అంతర్రాష్ట్ర ముఠాను ఎస్వోటీ, మాదాపూర్, మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి ఇద్దరు చిన్నారులను స్వాధీనం చేసుకొని శిశువిహార్‌కు తరలించారు. కేసుకు వివరాలను బుధవారం గచ్చిబౌలిలోని కార్యాలయంలో మాదాపూర్ డీసీపీ రితిరాజ్, ఎస్వోటీ డీసీపీ శోభన్కుమార్తో కలిసి మీడియా సమావేశంలో వెల్లడించారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న ఎస్వోటీ, మియాపూర్ పోలీసులు.. చాకచక్యంగా నిందితులను అరెస్ట్ చేసినట్టు తెలిపారు.
నిరుపేదలు, లేబర్ క్యాంపుల్లో నివసించే వారికి డబ్బులు అశచూపి పసిపిల్లలను కొనుగోలు చేసి, ఐవీఎఫ్ సెంటర్లకు వచ్చే సంతానం లేని దంపతులకు భారీ మొత్తానికి అమ్ముకుంటున్నట్టు గుర్తించామని డీసీపీ రితిరాజ్ తెలిపారు. ప్రధాన నిందితులు బాబురెడ్డి, గంగాధర్‌రెడ్డి వేర్వేరు గాంగ్‌లను నడుపుతున్నట్టు చెప్పారు. నిందితుల నుంచి 10 రోజుల వయస్సు కలిగిన ఇద్దరు పిల్లలను స్వాధీనం చేసుకుని శిశువిహార్‌కు తరలించామని వెల్లడించారు.
ఓ చిన్నారిని గుజరాత్‌లోని అహ్మదాబాద్ నుంచి మరో చిన్నారిని సిద్దిపేట జిల్లా రామన్నపేట నుంచి తీసుకువచ్చినట్టు వివరించారు. పిల్లలను రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు కొనుగోలు చేసి, రూ.6 లక్షల నుంచి రూ.7 లక్షలకు అమ్ముతున్నట్టు తెలిపారు. సంచలనం కలిగించిన సృష్టి సంతాన సాఫల్య కేంద్రం అక్రమాలతోనూ నిందితులకు సంబంధాలు ఉన్నాయని వెల్లడించారు. సమావేశంలో మాదాపూర్ ఎస్వోటీ డీసీపీ శోభన్‌కుమార్, శంషాబాద్ డీసీపీ రాజేశ్‌తోపాటు పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు. నిందితులను కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయస్థానం రిమాండ్ విధించింది.