సంగారెడ్డి : బీదర్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో అంతర్రాష్ట్ర క్రైమ్ రివ్యూ సమావేశం జరిగింది. కర్నాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల బార్డర్ జిల్లాల ఎస్పీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సరిహద్దు జిల్లాల పోలీసులు సత్సంబంధాలు కలిగి ఉండాలని, నేరాల అదుపునకు కృషి చేయాలని నిర్ణయించారు. డీఎస్పీ, సీఐ, ఎస్ఐలు బార్డర్ పోలీస్స్టేషన్లతో సత్సంబంధాలు కలిగి పరస్పరం సమాచారం అందించుకోవాలని, మిస్సింగ్ కేసులు, గుర్తు తెలియని మృతదేహాల సమాచారం లుక్ ఔట్ నోటీస్‌లను బార్డర్ పోలీస్స్టేషన్లకు ఇవ్వడం ద్వారా మిస్సింగ్ కేసులను గుర్తించడం సులభతరమవుతుందన్నారు.
అంతర్రాష్ట్ర దొంగల ముఠా సమాచారం పరస్పర బదిలీ ద్వారా కేసులను త్వరితగతిన ఛేదించగలమని, వీఐపీలకు ఎస్కార్ట్, పైలేటింగ్ విషయమై సహకారం అందించుకోవాలని నిర్ణయించారు. ఇక ప్రాంతంలో నేరం చేసి.. ఇతర రాష్ట్రాల్లో తలదాచుకుంటున్న నేరస్తుల విషయంపై సహకారం అందించుకోవాలని పోలీస్ అధికారులు నిర్ణయించారు. సమావేశంలో బీదర్, కామారెడ్డి జిల్లాల ఎస్పీలు కిశోర్‌బాబు, శ్రీనివాస్‌రెడ్డి, లాతూర్, నాందేడ్, నారాయణఖేడ్, జహీరాబాద్ డీఎస్పీలు, సీఐలు సమావేశంలో పాల్గొన్నారు.