నాంపల్లి కోర్టులు, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): ఫోన్ల ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ ప్రభాకర్‌రావుతోపాటు మరో నిందితుడు, ఓ మీడియా సంస్థ ప్రతినిధి శ్రావణ్‌కుమార్‌ను అరెస్టు చేసేందుకు ఇంటర్‌పోల్ చర్యలు చేపట్టినట్టు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సాంబశివారెడ్డి వెల్లడించారు. నిందితుల అరెస్టు కోసం జారీ అయిన వారెంట్ పత్రాలను సీబీఐ ద్వారా ఇప్పటికే ఇంటర్‌పోల్‌కు పంపామని, వారిని త్వరలో అరెస్టు చేసే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు.
అరెస్టు వారెంట్ల అమలులో జరుగుతున్న జాప్యంపై సోమవారం నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన మెమో లో ఆయన ఈ విషయాలను స్పష్టం చేశా రు. కాగా, ఈ కేసులో రిమాండ్ ఖైదీలుగా కొనసాగుతున్న ప్రణీత్‌రావు, తిరుపతన్న, రాధాకిషన్‌రావును సోమవారం జైలు అధికారులు 12వ అదనపు చీఫ్ జ్యుడిషియల్ కోర్టులో హాజరుపర్చారు. మరో నిందితుడైన అదనపు ఎస్పీ భుజంగరావు ప్రస్తుతం మధ్యంతర బెయిల్‌పై కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీంతో భుజంగరావు గైర్హాజరు పిటిషన్, హెల్త్ రిపోర్టులను ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు సమర్పించారు. భుజంగరావు బెయిల్ గడువు ఈ నెల 30తో ముగియనుండటంతో అక్టోబర్ 1న ఆయన కోర్టులో హాజరు కావాలని న్యాయమూర్తి ఆదేశించారు.