హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): ఇంటర్న్‌షిప్.. చదువుకుంటూనే పరిశ్రమల పనితీరును తెలుసుకోవడం.. నైపుణ్యాలను ఆర్జించడం. పని ప్రాంతాల్లో ప్రత్యక్ష అనుభవాన్ని గడించడం. ఇలాంటి ఇంటర్న్‌షిప్‌లను అందిపుచ్చుకోవడంలో తెలంగాణ విద్యార్థులు అగ్రస్థానంలో ఉన్నారు. జాతీయంగా ఇంటర్న్షిప్స్ కల్పిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ 96శాతంతో టాప్ -2లో ఉంది. పక్కనే ఉన్న ఏపీ 98.33శాతంతో మొదటిస్థానంలో ఉంది.
ఇదే విషయాన్ని ఇండియా స్కిల్ రిపోర్ట్ -2024 వెల్లడించింది. ఇటీవలీ కాలంలో బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ వంటి కోర్సుల్లోని ప్రెషర్స్‌కు త్వరగా ఉద్యోగావకాశాలు లభించడంలేదు. దీంతో గ్రాడ్యుయేట్లను ప్రోత్సహించేందుకు గూగుల్, మైక్రోసాఫ్ట్, పేస్బుక్ వంటి దిగ్గజ కంపెనీలు ఇంటర్న్‌షిప్‌లకు విలువనిస్తున్నాయి. వారికి మంచి ైస్టెపెండ్ను చెల్లిస్తున్నాయి. దీనికి కొనసాగింపుగా మంచి ప్లేస్‌మెంట్స్ కోసం విరివిగా ప్రోత్సహిస్తున్నాయి.
జాతీయంగా ఇంటర్న్‌షిప్‌లు కల్పిస్తున్న టాప్ -10 రాష్ర్టాల్లో ఐదు దక్షిణాది రాష్ర్టాలే ఉండటం విశేషం. ఏపీ, తెలంగాణ 90శాతానికి పైగా, తమిళనాడు, కర్ణాటక, కేరళలు 88 నుంచి 84శాతం మధ్యలో ఇంటర్న్‌షిప్‌లు కల్పిస్తున్నాయి. ఈ ఐదు రాష్ర్టాల్లో ఐటీ పరిశ్రమ విస్తరించడం, మల్టీనేషనల్ కంపెనీలు దక్షిణాది రాష్ర్టాల్లోనే కొలువై ఉండటం కలిసొచ్చే అంశం. కంప్యూటర్ సైన్స్ నైపుణ్యం గల విద్యార్థులు అత్యధికంగా దక్షిణాదిలోనే ఉన్నారు. ప్రముఖ విద్యాసంస్థలైన ఐఐటీలు, ఐఐఎంలు సైతం ఉండటం కూడా అత్యధికంగా ఇంటర్న్‌షిప్‌లు ఉండటానికి ఓ కారణంగా చెప్పవచ్చు.