హైదరాబాద్ సిటీబ్యూరో/మాదాపూర్, జూలై 7: ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్యసేవలను అందించేందుకు తాము ఎప్పుడూ ముందుంటామని యశోద గ్రూప్ హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ జీఎస్ రావు స్పష్టం చేశారు. ఉదరంలో మంట (ఇన్ఫ్లమేటరీ బొవెల్ డిసీజ్-ఐబీడీ)తో బాధపడేవారికి చికిత్సను అందించడంలో వైద్య రంగం సాధించిన పురోగతిపై ఆదివారం మాదాపూర్ హైటెక్‌సిటీలోని యశోద దవాఖానలో అంతర్జాతీయ సదస్సుతోపాటు లైవ్ వర్క్‌షాప్ నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్ జీఎస్ రావు మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఐబీడీతో బాధపడుతున్నారని, దక్షిణ భారతావనిలో ఈ కేసులు అధికంగా నమోదవుతున్నాయని తెలిపారు.
ఐబీడీ రోగులకు చికిత్సను అందించేందుకు కొత్త మందులు, బయోలాజికల్ ఏజెంట్లు అందుబాటులోకి వచ్చాయని, ఈ వ్యాధిని ముందుగానే గుర్తించగలిగితే 90% కంటే ఎక్కువ మంది రోగుల్లో సమస్యను నివారించేందుకు వీలుంటుందని సోమాజిగూడ యశోద దవాఖాన సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు, ఐబీడీ స్పెషలిస్టు డాక్టర్ కిరణ్ పెద్ది వివరించారు. ఈ కార్యక్రమంలో దేశ, విదేశాలకు చెందిన 300 మందికిపైగా గ్యాస్ట్రో ఎంటరాలజిస్టులు, సర్జన్లు పాల్గొన్నారు.