Congress | హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ అధికార చిహ్నం మార్పు, రాష్ట్ర గీతంపై వివాదం అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా చిచ్చు రేపింది. రేవంత్ వ్యక్తిగత ఎజెండా, కక్షసాధింపు చర్యలు, ఏకపక్ష నిర్ణయాల వల్ల పార్టీకి, ప్రభుత్వానికి నష్టం వాటిల్లే ప్రమాదం ఏర్పడిందన్న చర్చ కాంగ్రెస్ పార్టీలో మొదలైంది. ప్రజలిచ్చిన అధికారాన్ని దీర్ఘకాలం నిలుపుకొనే వ్యూహంతో ముందుకెళ్లాల్సింది పోయి ఇలా వివాదాస్పద నిర్ణయాలతో ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీయడం ఏమీ బాగోలేదని మంత్రులు సైతం అంతర్గత సంభాషణల్లో తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నట్టు సమాచారం. రేవంత్‌రెడ్డి దుందుడుకు చర్యల వల్ల ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత వ్యక్తమవుతున్నదన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారపగ్గాలు చేపట్టి దాదాపు ఆరునెలలు కావొస్తున్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ప్రభుత్వం పూర్తిగా నెరవేర్చలేదు. ఈ విషయంలో ప్రజల్లో ఉన్న వ్యతిరేకత పార్లమెంటు ఎన్నికల సమయంలో ప్రస్ఫుటంగా కనిపించింది. ఫలితాల సమయంలో ఇది కనిపించే అవకాశం ఉన్నదని చెప్తున్నారు. అధికార యంత్రాంగంపై ఇంకా పట్టు లభించలేదని, ప్రభుత్వం ఇంకా గాడిలో పడలేదని పేర్కొంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే విద్యుత్తు కొరత, రైతులకు రుణమాఫీపై ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడం, రైతుబంధు సకాలంలో అందజేయకపోవడం, మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళకు రూ.2500 చెల్లిస్తామన్న హామీ నిలబెట్టుకోలేదని పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ప్రజలు నిలదీసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
మరోవైపు అకాల వర్షాల వల్ల సంభవించిన భారీనష్టం, తడిసిన వడ్లు, ధాన్యం కొనుగోలు సమస్యలు చుట్టిముట్టిన తరుణంలో సన్నవడ్లకే బోనస్ ఇస్తామని మాట మార్చడం పట్ల రైతన్నలు ఆగ్రహంతో ఉన్నారు. దీనికితోడు మునుపెన్నడూ లేనివిధంగా రాష్ట్రవ్యాప్తంగా విత్తనాల కొరత వేధిస్తున్నది. ఇలాంటి సమయంలో రేవంత్‌రెడ్డి అనవసరంగా రాష్ట్ర చిహ్నం, రాష్ట్ర గీతంపై వివాదం రేపడం అవసరమా? అని పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. వారం రోజులుగా రాష్ట్రంలో రాజుకున్న ఈ వివాదంపై పార్టీలో ముఖ్య నేతలు ఎవరూ నోరుమెదపకపోగా, మంత్రులు అందరూ పదరుకున్నటే ఈ వివాదానికి దూరంగా ఉండడంపార్టీలో అంతర్గతంగా రేగిన చిచ్చుకు నిదర్శనమని చెప్తున్నారు. ఈ విషయాన్ని కొందరు నాయకులు అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతున్నదో తమకు ఎందుకు చెప్పడం లేదని రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్జి దీపాదాస్ మున్షీని అధిష్ఠానం ప్రశ్నించినట్టు తెలిసింది. ఈ కారణంగానే ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలలో ఎప్పడూ కనిపించని దీపాదాస్ మున్షీ సచివాలయంలో గురువారం సీఎం అధ్యక్షతన జరిగిన సమావేశానికి హజరుకావడం వెనక కారణం అదే అయి ఉంటుందని పార్టీ నాయకుడు ఒకరు అభిప్రాయపడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వ అధికార చిహ్నం మార్పు, రాష్ట్ర గీతంపై వివాదానికి మంత్రులు దూరంగా ఉండటం, అది సీఎం రేవంత్‌రెడ్డి చుట్టే తిరగడం అధిష్ఠానం దృష్టికి వెళ్లినట్టు తెలిసింది. దీనికితోడు కొందరు మంత్రులు కూడా ఈ విషయాన్ని అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఈ అంశంపై అధిష్ఠానం సంజాయిషీ కోరిన తర్వాతే ఇందులోకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను సీఎం రేవంత్‌రెడ్డి లాగి, తన ఒక్కడి నిర్ణయం కాదని, తామందరి సమిష్టి నిర్ణయంగా చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ భట్టి అంటీముట్టనట్టు వ్యవహరించి ఒడిశాలో ఎన్నికల ప్రచారానికి వెళ్లినట్టు తెలిసింది. ఈ వివాదంలో తను ఒక్కడినే టార్గెట్ చేసేలా ఉన్నారనే విషయం రేవంత్‌రెడ్డి పసిగట్టిన తర్వాతే రాష్ట్ర చిహ్నం మార్పుపై ఇంకా విస్తృత చర్చ జరగాలనే సాకుతో వాయిదా వేసి, రాష్ట్ర గీతాన్ని యథాతథంగా ఆమోదించి ఉండవచ్చని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. రాజకీయ పరిశీలకులు సైతం కారణం అదే అయిఉండవచ్చని చెప్తున్నారు.