వరంగల్, అక్టోబర్ 14(నమస్తే తెలంగాణ ప్రతినిధి): వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కాంగ్రెస్‌లో కొట్లాటలు కొనసాగుతూనే ఉన్నాయి. డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి మధ్య టికెట్ల పోరు తీవ్రమై పెద్దమ్మగడ్డ ప్రాంతంలో ఇటీవల రెండు వర్గాల నేతలు ఇష్టం వచ్చినట్టుగా కొట్టుకున్నారు. పాదయాత్ర సందర్భంగా ఒకవర్గంపై మరో వర్గం దాడి చేయడం, ఆ తర్వాత రెండు వర్గాల వారు రోడ్డుపైనే కొట్టుకుని కేసులు పెట్టుకున్నారు. తాజాగా మరో వివాదం చెలరేగింది.
జంగా రాఘవరెడ్డి పార్టీ మారుతున్నాడంటూ నాయిని రాజేందర్‌రెడ్డి అనుచరుడు తోట పవన్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. దీనిపై జంగా రాఘవరెడ్డి శనివారం సుబేదారి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. నాయిని రాజేందర్ ప్రోద్బలంతోనే ఇదంతా జరుగుతన్నదని రాఘవరెడ్డి వర్గం ఆరోపిస్తున్నది. టికెట్ విషయం కాంగ్రెస్ అధిష్ఠానం తేలుస్తుందని, ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం వెనుక నాయిని కుట్ర ఉన్నదని అంటున్నది. రాఘవరెడ్డిపై నాయిని వర్గం తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నది. ఇలా కాంగ్రెస్‌లోని రెండువర్గాల లొల్లి ఇప్పుడు ఆ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది.