సైదాపూర్ నవంబర్ 15 : కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం శివరాంపల్లికి చెందిన ఇంటర్ విద్యార్థిని శనివారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రెడ్డి లావణ్య-రాజు దంపతుల కుమార్తె అర్చన (16) సోమారం ఆదర్శ పాఠశాలలో ఇంటర్ చదువుతున్నది. శుక్రవారం స్కూల్కు వెళ్లి ఇంటికి వచ్చింది.
రాత్రి అందరూ భోజనం చేసిన తరువాత ఇంట్లో పడుకున్నారు. కుటుంబసభ్యులు ఉదయం లేచి చూసేసరికి అర్చన నోటి నుంచి నురగవచ్చి చనిపోయి ఉన్నది. సైదాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతురాలి తండ్రి తన కుమార్తె విషపురుగు కాటువేయడంతో చనిపోయి ఉండవచ్చని ఫిర్యాదు చేశాడు. అర్చన మృతదేహాన్ని హుజూరాబాద్ దవాఖానకు తరలించారు. విద్యార్థిని మృతికి గల కారణాలు తెలియాల్సి ఉన్నది.