Students | హైదరాబాద్ సిటీబ్యూరో, మే 1 (నమస్తే తెలంగాణ) : కేశంపేటలో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం విద్యార్థి రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్‌లోని నారాయణ కాలేజీలోని బైపీసీ మొదటి సంవత్సరం విద్యార్థిని ఫలితాలు చూసిన తర్వాత మానసిక ఒత్తిడికి గురై ఉరివేసుకుని అత్మహత్య చేసుకుంది. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో విద్యార్థిని ఇంగ్లిష్ ప్రాక్టికల్ పరీక్షకు హాజరుకాకపోవడం వల్ల ఫెయిల్ కావడంతో ఆవేదనకు గురై తనువుచాలించింది. ఇలా.. ఇంటర్మీడియట్ ఫలితాలు రాష్ట్రవ్యాప్తంగా పలువురు విద్యార్థుల తల్లిదండ్రులకు తీరని విషాదాన్ని నింపాయి. గొప్ప చదువులు చదివి ప్రయోజకులు అవుతారని కలలుగన్న ఆ కన్నవారికి శోకాన్ని మిగిల్చారు. ఫలితాలు విడుదలైన కొన్ని గంటల్లోనే రాష్ట్రవ్యాప్తంగా ఆరుగురు విద్యార్థులు విగతజీవులయ్యారు. చదువే ప్రాణంగా ఎక్కువ మార్కులే లక్ష్యంగా ఏడాదంతా కష్టపడి చదివిన వాళ్లకు మార్కులు తగ్గడం, ఫెయిల్ కావడం వల్ల తల్లిదండ్రులు మందలిస్తారని, ఇరుగుపొరుగువాళ్లు హేళన చేస్తారని భావించి మానసిక ఒత్తిడికి గురై తనువుచాలించారు.
మానసిక సమస్యలతో బాధపడేవారికి కౌన్సిలింగ్, వైద్యం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం టెలిమానస్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నది. ఇందులోభాగంగా తెలంగాణకు సంబంధించి ఎర్రగడ్డ మానసిక వైద్యశాల నోడల్ ఏజెన్సీగా ఉంది. ఆత్మహత్యల నివారణే లక్ష్యంగా ఏర్పడిన టెలీమానస్ విద్యార్థులకు మరింత అండగా నిలుస్తున్నది. సాధారణ సమయంలో టోల్‌ఫ్రీ నం 14416 లేదా1800-891-4416కు రోజుకు 200 ఫోన్‌కాల్స్ వస్తే అందులో సుమారు 20కాల్స్ విద్యార్థులవే ఉంటున్నాయి. చదవలేకపోతున్నామని, పరీక్షల పట్ల ఒత్తిడికి గురవుతున్నామని ఆవేదనను పంచుకుంటున్నారు. ప్రధానంగా పరీక్షల్లో మార్కులు తక్కువొస్తే అమ్మానాన్న తిడతారేమోనని, ఫెయిల్ అయితే అందరూ హేళన చేస్తారని బాధగా ఉందని చెప్పుకుంటున్నారు. కొందరైతే తీవ్ర ఆందోళనకు గురై భయంగా ఉంది… బతకాలని లేదు! అని చెప్తున్నారు. ఇలా పరీక్షల ఫలితాలు విడుదలైన నేపథ్యంలో విద్యార్థుల కాల్స్ సుమారు 40 వరకు ఉంటున్నాయి. అలాంటి వారి సమస్యలను వైద్యులు, మానసిక నిపుణులు ఓపికతో విని, తగిన పరిష్కారం చెప్తున్నారు. ఇక్కడ 20 మంది టెలీకౌన్సిలర్లు, ఇద్దరు సైకియాట్రిస్ట్‌లు, ఓ సైకాలజిస్ట్ అందుబాటులో ఉంటారు. బాధితుల వివరాలు గోప్యంగా ఉంచుతూ ఒత్తిడి, ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనల నుంచి పూర్తిస్థాయిలో బయటికి తీసుకొస్తున్నారు.
తల్లిదండ్రులు తమ పిల్లలను గొప్పగా చూడాలని ఆశపడుతారు. పిల్లల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా తల్లిదండ్రుల ఇష్టాలను వారిపై బలవంతంగా రుద్దుతున్నారు. నేటి రోజుల్లో చాలామంది తల్లిదండ్రులు మార్కులు తక్కువొస్తే మందలించేవారే తప్ప, ధైర్యం చెప్పే వారు అరుదుగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల వల్లే విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఈ ఒత్తిడి పట్టణాల్లో అధికంగా ఉంది. ప్రతీ విద్యార్థిలో ప్రతిభ దాగి ఉంటుంది. ఆ ప్రతిభను వెలికి తీయడంలో 70 శాతం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విఫలమవుతున్నారు. విద్యార్థులు ఆనందంగా జీవించండి. జీవితం చాలా అందమైంది. మార్కులు, ర్యాంకులకోసం ప్రాణాలు తీసుకోకండి. మీరు చదివిన దాంట్లో ఎంత గుర్తుంటే అంతే రాయండి. ఫెయిల్ అయినా తిరిగి మళ్లీ విజయం సాధించే వరకు ప్రయత్నించండి. మానసికంగా కుంగిపోతే వెంటనే టెలీమానస్‌ను సంప్రదించండి. తల్లిదండ్రులు పిల్లలకు ధైర్యం చెప్పండి.