మెహిదీపట్నం, జూన్ 28: హాస్టల్లో ఉండటం ఇష్టం లేదని, వచ్చి ఇంటికి తీసుకెళ్లాలని చెప్పిన కొడుకుతో రేపు వస్తానని చెప్పాడా తండ్రి. చెప్పినట్టుగా ఆ రోజు వీలుకాకపోవడంతో మరుసటి రోజు వెళ్లాలని అనుకున్నాడు. ఆ ఒక్క రోజు ఆలస్యం ఆ బిడ్డడి ప్రాణం తీసింది. ఈ హృదయవిదారక ఘటన శనివారం గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన మహిపాల్ కుమారుడు ప్రభాస్ (17) గోల్కొండ సమీపంలోని అల్కాపూర్ రోడ్డులో ఉన్న షేక్‌పేట్ గురుకుల హాస్టల్లో ఉంటూ ఇంటర్ ఫస్టియర్ (ఎంపీసీ) చదువుతున్నాడు. అయితే, తనకు అక్కడ ఉండటం ఇష్టంలేదని వచ్చి తీసుకెళ్లాలని తండ్రికి ఫోన్ చేశాడు.
సరేనన్న తండ్రి శుక్రవారం రావాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల రాలేకపోయాడు. దీంతో మనస్తాపానికి గురైన ప్రభాస్ శనివారం ఉదయం హాస్టల్ గదిలో ఉరివేసుకున్నాడు. సమాచారం అందుకున్న గోల్కొండ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.