హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): ఇంటర్మీడియట్ ఫలితాలు ఆదివారం వెలువడగా గురుకుల విద్యార్థులు సత్తా చాటారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబర్చిన సాంఘిక, గిరిజన, మైనారిటీ విద్యార్థులకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, సాంఘిక సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి సభ్యసాచి ఘోష్, గురుకుల సొసైటీల కార్యదర్శులు ఆదివారం ఒక ప్రకటనలో అభినందనలు తెలిపారు. గతేడాదికంటే ఈసారి ఉతీర్ణతశాతం పెరగడంపై హర్షం వ్యక్తంచేశారు. మంచి ఫలితాలు వచ్చేందుకు కృషిచేసిన అధికారులు, టీచర్లను అభినందించారు. ఇదిలా ఉండగా, ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి ఫస్టియర్ సంవత్సరం పరీక్షలకు 13,611 మంది హాజరు కాగా, వీరిలో 10,588 మంది (77.79శాతం)ఉత్తీర్ణులయ్యారు. సెకండియర్ 13,481 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, వారిలో 11,894 (88.22శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. బీసీ గురుకులాల నుంచి సెకండియర్‌లో 12,035 మంది హాజరవ్వగా, 10,856 (90శాతం), ఫస్టియర్‌లో 14,783మందికిగాను 12,664 మంది (86శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్ కోర్సులో ప్రథమ సంవత్సరం 191కు 183మంది (96శాతం), ద్వితీయ సంవత్సరంలో 176కు 172 మంది (98శాతం) ఉత్తీర్ణులయ్యారు. మొత్తంగా 41 విద్యాసంస్థలు 100శాతం ఫలితాలు సాధించాయి.