సిద్దిపేట/నాగర్‌కర్నూల్, పిబ్రవరి 28: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల హాజరుకు సంబంధించి అధికారులు నిమిషం నిబంధన అమలు చేయడంతో.. బుధవారం ప్రారంభమైన ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షను ఇద్దరు విద్యార్థులు రాయలేకపోయారు. సిద్దిపేట జిల్లాలో తొలిరోజు 11,039 మంది విద్యార్థులకుగానూ 10,328 మంది పరీక్షకు హాజరయ్యారు. సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రానికి ఇద్దరు విద్యార్థులు 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చారు. దీంతో ఆ విద్యార్థులను అధికారులు లోపలికి అనుమతించలేదు.
చేసేది లేక విద్యార్థులు నిరాశతో వెనుదిరిగారు. కాగా.. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో ఓ విద్యార్థిని స్వల్ప అస్వస్థతకు గురైంది. బిజినేపల్లి మండలం సల్కర్‌పేట గ్రామానికి చెందిన మల్లీశ్వరి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష రాసేందుకు తనకు కేటాయించిన బాలుర కళాశాలకు చేరుకున్నది. పరీక్షా హాల్లోకి వెళ్లిన కొద్దిసేపటికే కడుపునొప్పితో బాధపడుతున్నది. దీనిని గుర్తించిన ఇన్విజిలేటర్లు అంబులెన్స్‌లో జిల్లా జనరల్ దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స అనంతరం తిరిగి పరీక్షా హాల్లోకి అనుమతించారు.