హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ) : నకిలీ మెమోల బెడదను అరికట్టేందుకు ఇంటర్మీడియట్ బోర్డు పటిష్టచర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా కొత్త సెక్యూరిటీ ఫీచర్స్‌ను చేర్చుతున్నది. ఇదివరకు 18 రకాల సెక్యూరిటీ ఫీచర్స్‌తో మెమోలను ముద్రించగా, కొత్తగా ఏడింటిని చేర్చి 25కు పెంచింది.
ఈ విద్యాసంవత్సరం నుంచే కొత్త ఫీచర్స్‌తో ముద్రించిన మెమోలను అందజేయనున్నారు. మెమోలను ట్యాంపర్ చేయకుండా, నకిలీవి ముద్రించకుండా ఈ ఫీచర్స్‌ను చేర్చారు. వీటిలో అతి ముఖ్యమైనది అతినీలలోహిత ఫ్లోరోసెంట్ సెక్యూరిటీ ఫైబర్. ఇక మెమోలు ముద్రించే పేపర్ సైజును సైతం పెంచారు. ఇప్పటి వరకు 120 గ్రామ్స్ ఫర్ స్వేయర్(జీఎస్ఎం)మందం గల పేపర్లను వాడుతుండగా, ఇప్పుడు 180 జీఎస్ఎంకు పెంచారు.
ఇంటర్ మెమోలపై ఫిర్యాదులొస్తున్నాయి. కంపెనీలు, ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీల్లో పాల్గొనే అభ్యర్థుల సర్టిఫికెట్లపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆయా సంస్థలు, రక్షణ మంత్రిత్వశాఖలు.. సర్టిఫికెట్లు అసలువా? నకిలీవా? అంటూ ఆరా తీస్తున్నాయి. దీంతో ఇంటర్ బోర్డు మెమోలపై క్యూఆర్ కోడ్ ముద్రిస్తున్నది. కోడ్ స్కాన్ చేయగానే విద్యార్థి వివరాలు వస్తాయి. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సహకారంతో ఆరేండ్ల విద్యార్థుల డేటాను వెబ్‌సైట్‌తో అనుసంధానించడంతో మెమోపై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే.. మెమో ఒరిజినలా, కాదా అన్నది తేలిపోతుంది.