హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): ధాన్యం కొనుగోళ్లలో ఎదురవుతున్న స్టోరేజీ, ట్రాన్స్పోర్ట్ సమస్యల పరిష్కారానికి ఇందుకోసం ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ధాన్యం దించుకునేందుకు మిల్లర్లు సహకరించని చోట, స్టోరేజీ స్పేస్ లేనిచోట వెంటనే ప్రభుత్వ ఆధ్వర్యంలో మధ్యస్థ (ఇంటర్మీడియట్) గోదాములను సిద్ధం చేసి, వాటిలో ధాన్యం నిల్వ చేయాలని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ కలెక్టర్లను ఆదేశించారు. ధాన్యం రవాణాకు లారీల సమస్య ఉన్నచోట ప్రత్యామ్నాయంగా ట్రాక్టర్లను కూడా వినియోగించాలని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లలో ఎదురవుతున్న సమస్య పరిష్కారం కోసం బుధవారం ఆయన పౌర సరఫరాల సంస్థ చైర్మన్ సర్దార్ రవీందర్‌సింగ్‌తో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్లలో రానున్న 10 రోజులు అత్యంత కీలకమన్నారు. అధికార యంత్రాంగం మొత్తం క్షేత్రస్థాయిలోనే ఉండాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లకు గతం కంటే ఈసారి 500 కేంద్రాలను అదనంగా ఏర్పాటు చేయడంతోపాటు రైతుల నుంచి 10 లక్షల టన్నుల అధిక ధాన్యాన్ని సేకరించామని తెలిపారు.
అవసరమైతే పొరుగు రాష్ర్టాల గోదాములు
ఇంటర్మీడియట్ గోదాములు అందుబాటులో లేని జిల్లాలు తమ సరిహద్దు జిల్లాల్లోని గోదాములను వినియోగించుకోవాలని మం త్రి గంగుల ఆదేశించారు. అవరమైతే రాష్ట్ర సరిహద్దులకు సమీపంలో గల జగ్గయ్యపేట, రాయ్‌చూర్, బీదర్ తదితర ప్రాంతాల్లోని గోదాములను కూడా వినియోగించుకోవాలని సూచించారు. ఇంటర్మీడియట్ గోదాముల్లో దించే ధాన్యంతో మిల్లర్లకు ఎలాంటి సంబం ధం ఉండకూడదని చెప్పారు. ఇప్పటికే పలు జిల్లాల్లో ఇంటర్మీడియట్ గోదాములను ఏర్పాటు చేసినట్టు కలెక్టర్లు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. మెదక్ జిల్లాలో 30,700 టన్నులు, జగిత్యాలలో 52 వేల టన్నులు, సూర్యాపేటలో 40 వేల టన్నుల కెపాసిటీ గల గోదాములను ఏర్పాటు చేసినట్టు వివరించారు.
ఎఫ్‌సీఐ నిర్దేశించిన నిబంధనల ప్రకారమే ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రైతులను కోరారు. కొనుగోలు కేంద్రంలో ఒకసారి ధాన్యాన్ని తూకం వేసిన తర్వాత తేమ, తాలు పేరుతో తరుగు తీయొద్దని ఆదేశించారు. తెలంగాణలో రైతులు పండించిన ప్రతి గింజనూ కొనడం ఎంత ముఖ్యమో పక రాష్ట్రాల నుంచి ధాన్యం తెలంగాణలోకి రాకుండా నిరోధించడం కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ విప్లవాత్మక చర్యలతో రాష్ట్రంలో వ్యవసాయం పండుగైందని, రైతుల జీవితాల్లో మార్పు వచ్చిందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా అన్ని పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులకు అండగా నిలుస్తున్నారని, దీన్ని ఓర్వలేక ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని మంత్రి గంగుల ఆగ్రహం వ్యక్తం చేశారు.