హైదరాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ): యువత ఆలోచనల్లో అనేక మార్పులకు, ప్రభావాలకు గురవుతున్నది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, వివాహం, సామాజిక సంబంధాలు తదితర అంశా ల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నది. స్వశక్తితో ఎదిగేందుకు ఉత్సుకత ప్రదర్శిస్తూ, తమదైన ముద్ర వేయాలని తహతహలాడుతున్నది. అదే సమయంలో అనేక సంఘర్షణలకు లోనవుతున్నది. సమాజ అభివృద్ధి వేగాన్ని సర్దుబాటు చేసుకోలేక సతమవుతున్నది. ఈ నేపథ్యంలోనే యువత ఆలోచనలు ఏమి టి? ఏం కోరుకుంటున్నది? తదితర అంశాలపై సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలప్మెంట్ సొసైటీ (సీఎస్డీఎస్) దేశంలోని 18 రాష్ర్టాల్లో సర్వేను నిర్వహించింది. 18-34 ఏండ్ల వయసున్న సుమారు 6,277 మంది యువతీయువకులతో నేరుగా మాట్లాడి ఆయా అంశాలపై వారి అభిప్రాయాలను తెలుసుకొన్నది. ఉద్యోగ ఆకాంక్షలు, ప్రాధాన్యతలు తదితర అంశాలపై వివరాలను సేకరించింది. వాటన్నింటినీ క్రోడీకరించి ‘భారతీయ యువత ఆకాంక్షలు, భవిష్యత్తు ప్రణాళికలు’ పేరిట నివేదికను విడుదల చేసింది. అందులో అనేక ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి.
ఉపాధి, ఉద్యోగ రంగాలపై అభిప్రాయాన్ని కోరగా.. ప్రభుత్వరంగ ఉద్యోగం కావాలని 55 శాతం మంది చెప్పారు. అదే 2016లో 65 శాతం మంది సర్కారీ కొలువుకు ఓటేశారు. ప్రస్తుతం సొంత వ్యాపారానికి 24 శాతం మంది మక్కువ చూపారు. 2016లో 19 శాతం మందే సొంతగా బిజినెస్ చేసుకోవటానికి ఉత్సుకత చూపించారు. ఇప్పుడు 5 శాతం మంది పెరిగారు. ప్రైవేట్ జాబ్‌కు 9 శాతం మంది ఓటేశారు. ఇక, ఆరోగ్య రంగంపై 17 శాతం, ఉపాధ్యాయ వృత్తిపై, సైన్స్ అండ్ టెక్నాలజీపై 11 శాతం మంది ఆసక్తితో ఉన్నారు.
యువత అత్యధికంగా ఆందోళన చెందుతున్న అంశాల్లో కుటుంబ ఆర్థిక పరిస్థితి తొలి స్థానంలో ఉన్నది. 61 శాతం మంది కుటుంబ ఆర్థిక స్థితిపై ఆందోళనగా ఉన్నారు. వ్యక్తిగత ఆరోగ్యంపై 60 శాతం, ఉద్యోగం/ఉపాధిపై 56 శాతం, శరీర సౌందర్యం 54 శాతం, కుటుంబ కలహాలు 49 శాతం, గృహహింస 42 శాతం, వివాహం 32 శాతం మంది ఆందోళన చెందుతున్నారు.