హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): బీటెక్‌లో చేరి సాఫ్ట్వేర్ కొలువు కొట్టి.. లక్షల్లో జీతాలు పట్టాలని విద్యార్థులు కలలు కంటుంటారు. ఎంసెట్‌లో మంచి ర్యాంక్ సాధించేందుకు లాంగ్‌టర్మ్, షార్ట్‌టర్మ్ కోచింగ్‌లకు వెళ్తుంటారు. చివరికి పోటీని తట్టుకొని కొందరు మాత్రమే తమ కలను సాకారం చేసుకొంటారు. కాగా, బీటెక్ కోర్సుల్లో గత కొన్నేండ్లుగా బడుగులే అత్యధికంగా సీట్లు పొందుతున్నారు. వారిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన విద్యార్థులే అధికంగా ఉంటున్నారు. 2015తో పోల్చితే ఈ సామాజిక వర్గాల నుంచి బీటెక్‌లో చేరే వారి సంఖ్య ఏటా పెరుగుతున్నది. పేద విద్యార్థులకు ఉన్నత విద్య కల సాకారం చేసేందుకు ప్రభుత్వం ఇస్తున్న ఫీజు రీయింబర్స్మెంట్ ఆయా వర్గాలకు అండగా నిలుస్తున్నది. అదేసమయంలో బీటెక్‌లో చేరే ఓసీ కులాలకు చెందిన వారి శాతం ఏటా తగ్గుతున్నది.
ఫీజు రీయింబర్స్మెంట్ పథకం బడుగులకు తోడ్పాటునిస్తున్నది. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొంటూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన విద్యార్థులు బీటెక్ కోర్సుల్లో చేరుతున్నారు. ఈ ఏడాది కన్వీనర్ కోటాలో 61,702 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందితే.. వీరిలో 80 శాతం మంది ఫీజు రీయింబర్స్మెంట్ కోటాలోనే సీట్లు దక్కించుకొన్నారు. ఎంసెట్‌లో 10 వేల లోపు ర్యాంక్ వచ్చిన వారు ఏ కాలేజీలో చేరినా వారి మొత్తం ఫీజు ప్రభుత్వమే చెల్లిస్తుంది. 10 వేలకు పైగా ర్యాంక్ పొంది, ప్రభుత్వ కాలేజీల్లో చదవని వారికి ఏటా రూ.35 వేలను రీయింబర్స్‌మెంట్‌గా సమకూరుస్తున్నది. దీంతో అల్పాదాయ వర్గాలు.. పేద కుటుంబాలకు చెందిన వారు భరోసాతో ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరుతున్నారు. తమ కలను సాకారం చేసుకొంటున్నారు.