భద్రాచలం, ఫిబ్రవరి 18: ఆదివాసీ మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు అందించి, సంఘాలను బలోపేతం చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. గిరిజన రైతులను ప్రోత్సహించేందుకు తగినన్ని నిధులు విడుదల చేస్తామని అన్నారు. మళ్లీ ఇందిర జలప్రభ పథకాన్ని అమలు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని చెప్పారు. భద్రాచలంలోని ఐటీడీఏ సమావేశ మందిరంలో ఆదివారం నిర్వహించిన ఐటీడీఏ పాలక మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. భద్రాచలంలో కరకట్ట నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జిల్లా ఇన్చార్జి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతకు ‘న్యాక్’ ద్వారా శిక్షణ ఇప్పించి ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. మారుమూల గిరిజన గూడేల్లో మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యేలు రాందాస్‌నాయక్, పాయం వెంకటేశ్వర్లు, కూనంనేని సాంబశివరావు, కోరం కనకయ్య, డాక్టర్ తెల్లం వెంకట్రావు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, ఖమ్మం, భద్రాద్రి కలెక్టర్లు వీపీ గౌతమ్, ప్రియాంక పాల్గొన్నారు.
ఆదివాసీ ఎమ్మెల్యే తెల్లంకు అవమానం
ఐటీడీఏ పాలక మండలి సమావేశంలో ఆదివాసీ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుకు అవమానం జరిగింది. సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కలెక్టర్, పీవో పాల్గొన్న సమావేశంలోనే ఆయనకు ప్రాధాన్యం కొరవడింది. సాధారణ వ్యక్తిగా సమావేశంలో పాల్గొనాల్సి వచ్చింది. ఆదివాసీల సమస్యలపై చర్చించేందుకు వేదికపైకి ఆహ్వానించలేదు. ఈ ఘటనను ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కుంజా రమాదేవి తీవ్రంగా ఖండించారు.